- రాష్ట్రం కోసమే కూటమి : పవన్ కళ్యాణ్
- జగన్ క్రెడిట్ చోరీ : లోకేష్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలోని దామినేడులో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు ఈ సభలో. గత రెండేళ్లుగా కూటమి సాధించిన ప్రగతి గురించి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. భవిష్యత్తు ప్రగతి రోడ్ మ్యాప్ ను ప్రజల ముందు ఉంచారు. ఐదేళ్ల వైసిపి చీకటి పాలన, విధ్వంసం, అరాచకానికి ముగింపు పలికి ప్రజాపాలన వచ్చిందని.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులను సాధిస్తూ.. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ తరహాలో.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని నేతలు స్పష్టం చేశారు.
అదో చారిత్రాత్మకం..
ఏపీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కూటమికి 57% ఓటు షేర్, 94 శాతం స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక విజయాన్ని అందించాలని గుర్తు చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 63 లక్షల మందికి నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్లు అందించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసామని.. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20వేల రూపాయల సాగు సాయం అందిస్తున్న విషయాన్ని వివరించారు. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేందుకు లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును ఆవిష్కరిస్తున్నామని.. పుట్టపర్తిలో ఐదవ తరం ఫైటర్ జెట్ విమానాల కేంద్రం, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ల తయారీ ఫ్యాక్టరీ, జొన్నవాడలో బంగారం వెలికితీత పనులతో పాటు వచ్చే నెలలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ను ప్రారంభిస్తామని ప్రకటించారు చంద్రబాబు. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమకు మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యమని వివరించారు.
త్యాగాలు వెలకట్టలేనివి..
రాష్ట్రం కోసమే కూటమి అని.. రాజకీయ ప్రయోజనాలకు కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. కూటమి ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాలను, నిబద్ధతను గుర్తు చేశారు. ఎన్నికల్లో కేవలం 21 సీట్లతో మేము రాజీ పడలేదు.. ఏపీ భవిష్యత్తు కోసం మేము త్యాగం చేసామన్నారు. అందుకే ప్రజలు మాకు 100% విజయాన్ని అందించారని వ్యాఖ్యానించారు. సమిష్టి కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామని స్పష్టం చేశారు. వ్యవస్థలు బలహీనపడితే కులం, ప్రాంతీయత ముందుకు వస్తాయని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే ఒక రాష్ట్రం కులం దాటాలని.. మరో రాష్ట్రం ప్రాంతీయత దాటాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి తో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థకు తాము మళ్లీ జీవం పోసిన విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.
కూటమి ధర్మం పాటించండి..
జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ డిజాస్టర్ తో బాధపడుతున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ధర్మాన్ని క్యాడర్ అంతా పాటించాలని.. అహంకారం వీడి ప్రజాసేవకు పునర్కితం కావాలని పిలుపునిచ్చారు.. అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు, జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీతో యువతకు భరోసా ఇచ్చామన్నారు. జగన్ అనే పేరులోని జి అంటే కాదని… గొడ్డలి, విధ్వంసం అని ఎద్దేవా చేశారు. తాము కష్టపడి పెట్టుబడులు తీసుకొస్తుంటే.. అవి తానే తెచ్చానని గ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. తిరుపతి వేదికగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో కూటమి పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.