క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత వల్ల నెలకొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ బంకులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్స్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్లెట్స్) ఆర్డర్-2026 ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అనుసరించి వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై సాధారణ రిటైల్ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయకూడదు. వీరంతా తమ అవసరాలను సొంత వినియోగ పంపులు ద్వారా తీర్చుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా పెట్రోల్ బంకులు డీజిల్ ను కేవలం వాహనాల ట్యాంకుల్లో లేదా పెట్రోలియం అండ్ ఎక్స్క్లూజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కొనుగోలు చేసిన డీజిల్ ను తిరిగి విక్రయించడం కూడా పూర్తిగా నిషేధించింది.
ఇబ్బందికర పరిస్థితులను అధిగమించే ఉద్దేశంతో..
అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో దేశంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్ నుంచి చమురుతో వచ్చే నౌకలను హార్మోజ్ వద్ద నిలిపివేస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డీజిల్, పెట్రోల్ క్రైసిస్ ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ప్రారంభ దశలో గరిష్టంగా 90 రోజులపాటు అమలులో ఉంటాయి. పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు ద్వారా ఈ గడువు పొడిగించే అవకాశం కూడా ఉంది. నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ప్రధానంగా ఈ ఉత్తర్వుల యొక్క ఉద్దేశం నిల్వలు బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోలు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు చేపట్టే ఉద్దేశంతోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అత్యవసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం తాజా మార్గదర్శకంలో వెల్లడించింది. ఈ మార్గదర్శకాలు పట్ల పెట్రోల్ బంకులతో పాటు వినియోగదారులకు అవగాహన ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం అనేకచోట్ల పెట్రోల్ బంకు యజమానులు బ్లాక్ మార్కెటింగ్ చేయడం, కావలసిన వారికి పరిధికి మించి ఇవ్వడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల వ్యాపారాలు చేసే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపించే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి పెట్రోల్ బంకు నిర్వాహకులు పనిచేయాలని ఆదేశించింది.