క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరోసారి ప్రమాదం సంభవించింది. నాలుగు రోజుల కిందట జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా తాజాగా మరోసారి అదే తరహా ఘటన ఉక్కు ప్లాంట్లో చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్ఎంఎస్-1 విభాగంలోనే మరోసారి ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ల్యాడీల్ నుంచి ఉక్కు ద్రావణం కింద పడడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు లాడిల్ నుంచి ద్రావణం కింద పడిన సమయంలో కార్మికులు ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులతోపాటు కార్మికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతుండడంతో ప్లాంట్ భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా జరిగిన ఘటన గురువారం ఉదయం ఒకసారి, రాత్రి సమయంలో మరోసారి ఎస్ఎంఎస్-1 లో వేరువేరుగా ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు భయాందోళన చెందారు. భారీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టకుండా పనులు ప్రారంభించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ కార్మికుల ప్రాణాలను గాలిలో పెడుతూ ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయకుండా ఉత్పత్తిపై దృష్టి పెట్టడం సరికాదు అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
రెండేళ్లలో 25 కుపైగా ప్రమాదాలు..
విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇదేమి కొత్త కాదు. ఎప్పటికప్పుడు ప్రమాదాలు సంభవించడం ఇక్కడ పరిపాటిగా మారింది. ప్లాంట్లో వరస, కార్మికుల మరణాలు, భద్రతా ప్రమాణాల అమరుల వైఫల్యాలపై రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కేఎస్ఎన్ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 2024 జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 25 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు వల్ల 30 మంది వరకు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. సమగ్ర విచారణ చేపట్టకపోవడం, విచారణ నివేదికలు బహిర్గతం చేయకపోవడం, భద్రతా లోపాల సవరణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఉద్యోగులను తగ్గించడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై పని భారం పెరిగి ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు చేసేందుకు కూడా కార్మికులు భయపడుతున్నారు. రెండు రోజుల కిందట ప్రమాదం జరిగిన ఎస్ఎంఎస్ వన్ ప్రాంతంలోకి వెళ్లడానికి కూడా కార్మికులు భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.