Hometelanganaమరోసారి తప్పించుకున్న గంజాయి క్వీన్.. నిత్యం లక్షలలో గంజాయి విక్రయాలు..

మరోసారి తప్పించుకున్న గంజాయి క్వీన్.. నిత్యం లక్షలలో గంజాయి విక్రయాలు..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, అమ్మకాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. భారీ ఆపరేషన్లు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఈగల్ ఫోర్స్ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నో డ్రగ్స్ ముఠాలు, గంజాయి ముఠాల ఆట కట్టించింది. ఈ క్రమంలోనే నీతూ బాయి అనే లేడీ డాన్, గంజాయి క్వీన్ మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులకు సవాల్ విసురుతూనే ఉంది. గతంలో కొన్నిసార్లు పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన నీతూబాయి.. తాజాగా మరోసారి ఈగల్ ఫోర్స్ పంజా నుంచి తప్పించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో దాడులు చేసిన ఈగల్ ఫోర్స్‌కు భారీ మొత్తంలో ఐటీ ఉద్యోగులు చిక్కగా.. నీతూబాయి పరారైనట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కోర్ ఐటీ ప్రాంతమైన నానక్‌రాంగూడలో గంజాయి విక్రయాలు, వినియోగాలపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్ డాన్ నీతూబాయిని పట్టుకోవడమే లక్ష్యంగా ఈగల్‌ ఫోర్స్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఆమె తప్పించుకుంది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారం అందుకున్న నీతూబాయి.. అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమెను పట్టుకోవడం కోసం నానక్‌రాంగూడలో ఈగల్ ఫోర్స్ అణువణువూ గాలింపు చేపట్టింది. ఐటీ ఉద్యోగులు అత్యధికంగా ఉండే నానక్‌రాంగూడ ప్రాంతంలో నీతూబాయి.. భారీ ఎత్తున గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది. గంజాయి కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో ఐటీ ఉద్యోగులు.. నానక్‌రాంగూడలోని నీతూబాయి ఇంటి ముందు క్యూ కట్టినట్లు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఒక గంట వ్యవధిలోనే ఏకంగా 50 మంది ఐటీ ఉద్యోగులను పట్టుకున్నట్లు తెలిపింది. ధూల్‌పేట్ నుంచి మకాం మార్చేసి.. ఐటీ ఉద్యోగులు అత్యధికంగా ఉండే ప్రాంతంలో తన అడ్డాను ఏర్పాటు చేసుకున్న నీతూబాయి.. కిరాణా షాపు ముసుగులో భారీగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దాడుల్లో గుర్తించారు.నిత్యం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి విక్రయాలను నీతూబాయి కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే నీతూబాయిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి.. ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. జైలుకు వెళ్లి బయటికి వచ్చిన నీతూబాయి.. మళ్లీ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. ఈ డ్రగ్‌ డాన్‌ను పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్‌ అన్ని చర్యలు చేపట్టింది. 2023లో నీతూబాయి పోలీసులకు పట్టుబడినప్పుడు గంజాయి అమ్మకాలతో రూ.4 కోట్ల స్థిర, చరాస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించి.. వాటిని జప్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు