ఒమన్ సముద్ర తీరానికి సమీపంలో మరో భారత వాణిజ్య నౌకపై జరిగిన దాడి కలకలం రేపింది. పలావు దేశ జెండాతో ప్రయాణిస్తున్న సెట్టిబెల్లో అనే కెమికల్, ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా నౌకాదళం దాడి చేసింది. ఈ దాడి కారణంగా నౌక వెనుక భాగంలోని ఇంజిన్ విభాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే, ఒమన్ కోస్ట్ గార్డ్స్ సహాయక చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించింది. అయితే, ముగ్గురు సిబ్బంది ఇంకా కనిపించకుండా పోయారు. వారి కోసం సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. గల్లంతైన నావికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపింది.
నాలుగు రోజుల క్రితం మారివెక్స్ నౌక పైనా దాడి!
ఇదే ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం మారివెక్స్ అనే మరో వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది. ఆ సమయంలో నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. వరుసగా రెండు నౌకలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
భారత ప్రభుత్వం సీరియస్
ఈ ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకల భద్రతను కాపాడాలని, ఇలాంటి దాడులు వెంటనే నిలిపివేయాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా ప్రతినిధి జేసన్ మీక్స్ ను భారత అధికారులు పిలిపించి తమ నిరసనను తెలియజేసినట్లు సమాచారం. సముద్ర మార్గాల్లో వాణిజ్య రవాణాకు భంగం కలిగించే చర్యలు ప్రపంచ వాణిజ్యానికి ప్రమాదకరమని, నౌకల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని భారత్ కోరింది.