ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న రంభ, ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె, అప్పుడప్పుడు టెలివిజన్ కార్యక్రమాల్లో జడ్జిగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రంభ పంచుకుంది.
జేడీతో గొడవ గురించి..
ఈ సందర్భంగా నటుడు జేడీ చక్రవర్తితో తనకు వచ్చిన విభేదాల గురించి కూడా మాట్లాడింది. గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని, అందుకే చాలా కాలం మాట్లాడుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై రంభ పూర్తి వివరణ ఇచ్చింది. జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని తెలిపింది. కలిసి నటించిన రోజులలో ఆయన చాలా సరదాగా ఉండేవారని, షూటింగ్ సెట్లలో అందరినీ నవ్విస్తూ ఉత్సాహంగా ఉంచేవారని గుర్తుచేసుకుంది. “బొంబాయి ప్రియుడు” సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని చెప్పింది. ఆ తర్వాత “కోదండ రాముడు” చిత్రంలో కూడా కలిసి నటించామని తెలిపింది.
పెళ్లి సమయంలో ఆయన చేసిన పని నచ్చలే!
అయితే తన పెళ్లి సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా జేడీపై కోపం వచ్చిందని రంభ వెల్లడించింది. ఎంతో సన్నిహిత స్నేహితుడిగా భావించిన జేడీ తన వివాహానికి తప్పకుండా వస్తాడని అనుకున్నానని, కానీ ఆయన రాకపోవడంతో చాలా బాధపడ్డానని చెప్పింది. పెళ్లి తర్వాత కలిసినప్పుడు ఆ విషయంపై జేడీని ప్రశ్నించానని, తన మనసులో ఉన్న అసంతృప్తిని కూడా వ్యక్తం చేశానని తెలిపింది. ఆ తరువాత కొంతకాలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడం జరగలేదని చెప్పింది. జేడీ వివాహానికి రాకపోవడానికి చెప్పిన కారణాన్ని కూడా తాను నమ్మలేదని సరదాగా వ్యాఖ్యానించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టెలివిజన్ కార్యక్రమంలో ఇద్దరూ మళ్లీ కలిసి పాల్గొన్నారని, అప్పటికి పాత విషయాలను మర్చిపోయి మళ్లీ మునుపటిలాగే మాట్లాడుకున్నామని రంభ తెలిపింది. ఆ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎంతో సరదాగా గడిపామని చెప్పింది. రంభ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా ఈ స్నేహితుల మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనపై చర్చించుకుంటున్నారు.