HomeజాతీయంMonsoon: కేరళలోకి రుతుపవనాలు.. వర్షాల జోరు షురూ..

Monsoon: కేరళలోకి రుతుపవనాలు.. వర్షాల జోరు షురూ..

Monsoon Arrives in Kerala: దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో తమిళనాడు, లక్షద్వీప్‌ లోని కొన్ని ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశముందని తెలిపింది. గత రెండు మూడు రోజులుగా కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటం, అలాగే కేరళ తీరానికి ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులను సృష్టించిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వారం రోజుల పాటు కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

వచ్చే ఏడు రోజుల పాటు కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వచ్చే వారం దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఇక వాయవ్య, మధ్య, తూర్పు, దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని కూడా హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి మే 26కే రుతుపవనాలు వస్తాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది. తరువాత ఆ అంచనాను సవరించి మే 28 నుంచి జూన్ 3 మధ్య ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా మరోసారి అంచనాను మార్చి జూన్ 4న కేరళను తాకే అవకాశముందని వెల్లడించింది.

తెలంగాణలోనూ వర్షాలు

తెలంగాణలో కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని పేర్కొంది. అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు