మానవ సంబంధాలు రోజురోజుకు ఆర్థిక ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్న ఈ కాలంలో, చాలామంది తమ భావోద్వేగాలను పెంపుడు జంతువులతో పంచుకుంటూ వాటినే కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలు యజమానులతో ఏర్పరుచుకునే అనుబంధం ఎంత గాఢంగా ఉంటుందో అప్పుడప్పుడు జరిగే కొన్ని ఘటనలు స్పష్టంగా తెలియజేస్తుంటాయి. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన ఒకటి నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుడిగా భావించి ఏళ్ల తరబడి ప్రేమతో పెంచుకున్న పెంపుడు కుక్క మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంతేకాకుండా సాధారణ జంతువుగా కాకుండా ఇంటి సభ్యుడిలా భావించి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి తమ ప్రేమను, అనుబంధాన్ని చాటుకుంది.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామానికి చెందిన రైతు సామిడి మహేందర్ రెడ్డికి పెంపుడు జంతువులంటే చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన అభిమానం ఉంది. వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతిరోజూ ఇంటి నుంచి పొలానికి వెళ్లే ఆయనకు తోడుగా ఉండేందుకు ఒక శునకాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. కాలక్రమేణా ఆ శునకం కుటుంబంలో ఒక సభ్యుడిలా కలిసిపోయింది. దాని పిల్ల అయిన కాలభైరవను కూడా మహేందర్ రెడ్డి ఎంతో ప్రేమతో పెంచుకున్నాడు. ఇంటి వద్ద నుంచి పొలం వరకు ఎక్కడికెళ్లినా కాలభైరవ ఆయన వెంటనే ఉండేది. కుటుంబ సభ్యులందరికీ అది ఎంతో ఆప్యాయతను పంచుతూ ఇంట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
కాలభైరవపై మహేందర్ రెడ్డి కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో గతంలో జరిగిన ఒక ఘటన కూడా చూపించింది. ఒకసారి ఇతర కుక్కలు తరమడంతో భయపడి కాలభైరవ వ్యవసాయ బావిలో పడిపోయింది. ఆ విషయం తెలిసిన వెంటనే మహేందర్ రెడ్డి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికుల సహకారంతో పాటు క్రేన్ సాయంతో కాలభైరవను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడాడు. ఆ సంఘటన తర్వాత కుటుంబ సభ్యులు దానిని మరింత జాగ్రత్తగా చూసుకున్నారు. మహేందర్ రెడ్డికి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న ఆయనకు కాలభైరవ కేవలం పెంపుడు జంతువు మాత్రమే కాకుండా ఇంటి సభ్యుడిగా మారిపోయింది.
అయితే ఇటీవల జరిగిన ఒక ప్రమాదం ఈ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ట్రాక్టర్ ఢీకొనడంతో కాలభైరవ ప్రాణాలు కోల్పోయింది. ఆ వార్త తెలుసుకున్న మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా తమతో కలిసి జీవించిన కాలభైరవ మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కుటుంబ సభ్యుడికి చేసే విధంగానే దాని మృతదేహానికి పూలమాలలు వేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, గ్రామస్థులు, స్నేహితులు కూడా పాల్గొని కాలభైరవకు నివాళులర్పించారు. అంత్యక్రియలతో పాటు సంప్రదాయ ప్రకారం 3 రోజుల కార్యక్రమాలను కూడా నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కాలభైరవ మరణంపై స్పందించిన సామిడి మహేందర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తమకు అది కేవలం పెంపుడు జంతువు కాదని, కుటుంబంలో ఒక సభ్యుడని ఆయన తెలిపారు. కుటుంబ సంతోషాల్లోనూ, కష్టకాలాల్లోనూ తమతో పాటు ఉన్న కాలభైరవ మరణాన్ని అంగీకరించడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గ్రామస్తులను కూడా కదిలించింది. మనుషులు, జంతువుల మధ్య ఏర్పడే అనుబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి జాతి, భాష, రూపం అనే తేడాలు ఉండవని, మనసుతో పెంచుకుంటే మూగజీవాలు కూడా కుటుంబ సభ్యులుగానే మారిపోతాయని ఈ ఘటన స్పష్టంగా తెలియజేసింది.
ALSO READ: కోడి కాళ్లలోని ఈ రహస్యం తెలుసా..?