క్రికెట్ అభిమానులను దాదాపు 2 నెలల పాటు అలరించిన ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వసారి టైటిల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఐపీఎల్ ముగియడంతో ఇప్పుడు అభిమానుల దృష్టి అంతర్జాతీయ క్రికెట్ వైపు మళ్లింది. గత మార్చిలో జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ బాధ్యతలతో బిజీగా ఉండటంతో అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు లీగ్ ముగియడంతో జూన్ 6 నుంచే టీమిండియా మరోసారి మైదానంలో సందడి చేయనుంది. వచ్చే కొన్ని నెలల్లో భారత జట్టు ఆడబోయే సిరీస్‌లు, విదేశీ పర్యటనలు, ప్రధాన టోర్నీలతో కూడిన షెడ్యూల్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
జూన్ 6 నుంచి జూన్ 10 వరకు న్యూ చండీగఢ్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. శుభ్‌మన్ గిల్ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లతో బరిలోకి దిగనున్న భారత జట్టు ఈ మ్యాచ్‌తో కొత్త అంతర్జాతీయ సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహించనున్నారు. ఈ సిరీస్ భారత జట్టుకు రాబోయే కీలక పోటీలకు మంచి సన్నాహకంగా మారనుంది.
అఫ్గానిస్తాన్ సిరీస్ అనంతరం భారత జట్టు విదేశీ పర్యటనలకు బయలుదేరనుంది. జూన్ 26 నుంచి జూన్ 29 వరకు ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూలై నెలలో ఇంగ్లాండ్ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండబోతోంది. జూలై 1 నుంచి జూలై 11 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుండగా, అనంతరం జూలై 14 నుంచి జూలై 19 వరకు 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించనున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై జరిగే ఈ పోటీలు భారత జట్టుకు కఠిన సవాలుగా మారనున్నాయి.
ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే జూలై 23 నుంచి జూలై 26 వరకు జింబాబ్వేలో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంక పర్యటన షెడ్యూల్‌లో ఉంది. ఈ పర్యటనలో భారత్ 2 టెస్ట్ మ్యాచ్‌లు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను నిర్వాహకులు త్వరలో ప్రకటించనున్నారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా భారత జట్టుకు బిజీ షెడ్యూల్ ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో టీ20 ఫార్మాట్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో యువ ఆటగాళ్లకు అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు వెస్టిండీస్‌తో 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి.
అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటన భారత జట్టుకు అత్యంత సుదీర్ఘ సిరీస్‌గా నిలవనుంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ వరకు కొనసాగే ఈ పర్యటనలో 2 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తంగా చూస్తే ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టుకు విశ్రాంతికి పెద్దగా అవకాశం లేకుండా వరుస సిరీస్‌లు, విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ టోర్నీలతో నిండిన బిజీ షెడ్యూల్ ఎదురుచూస్తోంది. దీంతో అభిమానులకు ఏడాది పొడవునా క్రికెట్ వినోదం అందుబాటులో ఉండనుంది.
ALSO READ: పెంపుడు కుక్కకు అంత్యక్రియలు..