HomeజాతీయంLPG Price Hike: ఎల్‌పీజీ యూజర్లకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర!

LPG Price Hike: ఎల్‌పీజీ యూజర్లకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర!

దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. జూన్‌ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు వంటి వాణిజ్య వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

కమర్షియల్ సిలింగర్ పై రూ. 42 పెంపు

తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను ఢిల్లీలో రూ.42 మేర పెంచారు. దీంతో అక్కడ ఒక్కో సిలిండర్‌ ధర రూ.3,113.50కు చేరుకుంది. గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుండగా, తాజాగా మరోసారి పెంపు నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో ధర ఎలా ఉందంటే?

తెలుగు రాష్ట్రాలపై కూడా ఈ ధరల పెంపు ప్రభావం పడింది. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.3,294కు చేరుకుంది. ఇదే సమయంలో చెన్నైలో ఈ సిలిండర్‌ ధర రూ.3,232గా నిర్ణయించారు. కోల్‌కతాలో అత్యధికంగా రూ.53.50 పెంపు నమోదైంది. దీంతో అక్కడ వాణిజ్య సిలిండర్‌ ధర రూ.3,255కు చేరింది. అలాగే చిన్న వ్యాపారులు ఎక్కువగా ఉపయోగించే 5 కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను కూడా పెంచారు. ఈ సిలిండర్‌పై రూ.11 చొప్పున అదనంగా వసూలు చేయనున్నట్లు ఆయిల్‌ కంపెనీలు వెల్లడించాయి. దీంతో చిన్న స్థాయి వ్యాపారులు కూడా అదనపు ఖర్చును భరించాల్సి ఉంటుంది.

డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో నో ఛేంజ్!

అయితే సాధారణ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. గృహ అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగుతాయని ఆయిల్‌ సంస్థలు స్పష్టం చేశాయి. వాణిజ్య సిలిండర్‌ ధరల పెంపు ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ వ్యాపారాలు మరియు ఇతర వాణిజ్య రంగాలపై పడే అవకాశం ఉంది. దీంతో కొన్ని చోట్ల ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం కనిపించవచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. జూన్‌ నెల ప్రారంభంలోనే కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరగడం వ్యాపార వర్గాలకు అదనపు భారంగా మారగా, గృహ వినియోగ సిలిండర్‌ ధరలు యథాతథంగా ఉండటం సాధారణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పొచ్చు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు