దేశంలో బంగారం కొనుగోళ్లు ఇటీవల గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే బంగారం డిమాండ్ దాదాపు 70 శాతం వరకు పడిపోయిందటున్నాయి. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అలాగే పెరుగుతున్న జీవన వ్యయాలు కారణమని అంటున్నారు.
ప్రధాని మోదీ పిలుపు ఎఫెక్ట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. అదే సమయంలో బంగారం దిగుమతులపై సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. ఈ రెండు పరిణామాలు కలిసి బంగారం అమ్మకాలపై ప్రభావం చూపినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా సుమారు 25 టన్నుల బంగారం డిమాండ్ ఉండగా, ఈ ఏడాది సుంకాల పెంపు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా ఈ నెల 13న సుంకాలు పెరిగిన తర్వాత కేవలం రెండు వారాల్లోనే డిమాండ్ 7.5 టన్నులకు తగ్గినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు విలాసవంతమైన కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
బంగారు వ్యాపారులు ఏమంటున్నారంటే?
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ, బంగారం కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీ ప్రభావం కూడా పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం బంగారంపై మొత్తం పన్నుల భారం 9.18 శాతం నుంచి 18.45 శాతానికి చేరడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారని వివరించారు. జోయాలుక్కాస్ సంస్థ చైర్మన్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ, డిమాండ్ తగ్గడానికి కేవలం సుంకాల పెంపు మాత్రమే కారణం కాదన్నారు. ప్రధాని మోదీ చేసిన పిలుపు కూడా ప్రజల నిర్ణయాలపై ప్రభావం చూపిందని చెప్పారు. అటు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర జీఎస్టీ మినహా రూ.1.57 లక్షలకు చేరింది.