HomeజాతీయంArmy Chief Upendra: ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత్ సిద్ధం.. పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్...

Army Chief Upendra: ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత్ సిద్ధం.. పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్!

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. దేశ భద్రత విషయంలో భారత సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, అవసరమైతే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’కు కూడా త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భూమి, ఆకాశం, సముద్రం అనే మూడు రంగాల్లోనే కాకుండా ఆధునిక యుద్ధాలకు అనుగుణంగా తమ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

ప్రశాంత పరిస్థితులు శాశ్వతం కావు!

పుణెలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) 150వ పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం ఉన్న శాంతి పరిస్థితులు శాశ్వతం కావని అన్నారు. అవసరం ఏర్పడితే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

మారనున్న భవిష్యత్ యుద్ధాల స్వరూపం

భవిష్యత్ యుద్ధాల స్వరూపం గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోతుందని ద్వివేది పేర్కొన్నారు. ఇకపై యుద్ధాలు కేవలం భూమి, సముద్రం, గగనతలానికే పరిమితం కావని చెప్పారు. అంతరిక్షం, సైబర్ రంగం, సమాచార ప్రభావం వంటి కొత్త విభాగాల్లో కూడా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అందుకే సైనిక వ్యూహాలు, భద్రతా చర్యలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామని తెలిపారు.

‘ఆపరేషన్ సిందూర్’ తో సత్తా చాటిన భారత సైన్యం

‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత సైన్యం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని ఆయన అన్నారు. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల శక్తి మన దళాలకు ఉందని చెప్పారు. భవిష్యత్‌లో జరిగే ఏ యుద్ధంలోనైనా ప్రజల మద్దతు, జాతీయ ఐక్యత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత సైన్యంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని ద్వివేది తెలిపారు. ముఖ్యంగా యువత భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతికత ఆధారిత సైన్యాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రోన్ బెటాలియన్లు, దివ్యాస్త్ర బ్యాటరీలు, శక్తిమాన్ రెజిమెంట్లు, భైరవ్ బెటాలియన్లు లాంటి కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే భవిష్యత్ యుద్ధాల్లో నెట్‌వర్కింగ్, డేటా ఆధారిత వ్యవస్థలు కీలకంగా మారనున్నాయని చెప్పారు. డ్రోన్ల వినియోగంపై అన్ని సైనిక అకాడమీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దేశ రక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సైన్యం ముందుకు సాగుతోందని ద్వివేది పేర్కొన్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు