Homeక్రైమ్Karnataka Horror: భూ వివాదంలో రక్తపాతం.. ఆరుగురి నరికి చంపిన పాలోళ్లు!

Karnataka Horror: భూ వివాదంలో రక్తపాతం.. ఆరుగురి నరికి చంపిన పాలోళ్లు!

భూ వివాదం ఆరుగురు ప్రాణాలను బలిగొన్నది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. గోవిందపుర గ్రామంలో భూమి తగాదాల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు ఒకే కుటుంబంపై దాడి చేసి ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన చడచాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమా నది పరివాహక ప్రాంతంలో జరిగింది. మృతులను చందు నిరాలే (55), దుండప్ప నిరాలే (65), శివపుత్ర నిరాలే (58), రాహుల్ నిరాలే (25), సమర్థ నిరాలే (23), షబ్బీర్ నదాఫ్ (45)గా గుర్తించారు. వీరంతా గోవిందపుర గ్రామానికి చెందినవారే. దాడి సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అరవింద్ కటగే (72), సందీప్ మానే (33) ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిరాలే, గోలగి కుటుంబాల మధ్య భూమి విషయంలో చాలాకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తేలింది. ఇదే కక్షతో గోలగి వర్గానికి చెందిన వ్యక్తులు నిరాలే కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, 2015లో జరిగిన ఓ హత్య కేసుతో కూడా ఈ ఘటనకు సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షలు, భూ వివాదాలు కలిసి ఈ దారుణానికి కారణమయ్యి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

నిందితుల కోసం గాలింపు

దాడి సమయంలో కాల్పులు జరిగినట్లు తొలుత సమాచారం వచ్చినప్పటికీ, మృతదేహాల పరిశీలనలో తుపాకీ గాయాలు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. చెరకు కోయడానికి ఉపయోగించే  కోయితా అనే పదునైన ఆయుధాలతోనే బాధితులను నరికి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి స్పందిస్తూ, ఆరుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.

భూ వివాదం కారణంగా ఒకే ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు