దృఢ సంకల్పం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమేనని చైనాకు చెందిన పర్యావరణ ప్రేమికురాలు ఇన్ యుజెన్ ప్రపంచానికి నిరూపించారు. ఒకప్పుడు అంతా ఇసుకతో నిండిపోయిన ఎడారిని ఆమె ఏళ్ల తరబడి కష్టపడి పచ్చని అడవిగా మార్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కేవలం పర్యావరణ పరిరక్షణ కోసమే కాదు, అక్కడి ప్రజల జీవన విధానాన్ని మార్చాలనే లక్ష్యంతో ఆమె చేసిన పోరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయక కథగా మారింది. ఇసుక తుఫాన్లు, ఎడారి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రాంతాన్ని వేలాది మొక్కలతో పచ్చని వనంలా తీర్చిదిద్దిన ఆమె కృషిని ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోంది.
చైనాలోని నాలుగో అతిపెద్ద ఎడారిగా పేరుగాంచిన మౌవుసు ప్రాంతం ఒకప్పుడు పూర్తిగా ఇసుక మేటలతో కప్పబడి ఉండేది. అక్కడ జీవించడం కూడా కష్టంగా ఉండే పరిస్థితులు నెలకొనేవి. అలాంటి ప్రాంతాన్ని పచ్చదనంతో నింపాలనే సంకల్పంతో ఇన్ యుజెన్ ముందుకు వచ్చారు. ఆమెకు నెలకు కేవలం 250 డాలర్ల ఆదాయం మాత్రమే ఉన్నప్పటికీ, ప్రకృతి కోసం తన జీవితాన్నే అంకితం చేశారు. దాదాపు 14 ఏళ్ల పాటు ఇసుక తిన్నెలతో పోరాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ఆమె కృషి గురించి తెలుసుకున్న అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు రోనాల్డ్ సాకోల్స్కీ తీవ్రంగా ప్రభావితమయ్యారు.
1999లో రోనాల్డ్ సాకోల్స్కీ అమెరికాలోని పలు ఫౌండేషన్ల సహాయంతో రూ.5,000 డాలర్ల నిధులను సేకరించి ఇన్ యుజెన్కు తొలి విదేశీ విరాళంగా పంపించారు. ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా, మొత్తం మొక్కల కొనుగోలుకే వినియోగించారు. జ్ఞాపకార్థంగా ఒక డాలర్ నోటును మాత్రమే దాచుకుని, మిగిలిన మొత్తంతో దాదాపు 50,000 మొక్కలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి మౌవుసు ఎడారిని అడవిగా మార్చే ప్రయాణాన్ని మరింత వేగంగా కొనసాగించారు.
కొంతకాలం తర్వాత స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన రోనాల్డ్ సాకోల్స్కీ అక్కడ పెన్సిల్ పరిమాణంలో ఉన్న చిన్న మొక్కలను చూసి ఆశ్చర్యపోయారు. “ఇవి నిజంగా బతుకుతాయా? ఇక్కడ అడవి ఏర్పడుతుందా?” అంటూ సందేహం వ్యక్తం చేశారు. అయితే ఆయన మాటలకు స్పందించిన ఇన్ యుజెన్ “కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ రండి.. అప్పుడు మీకు అడవినే చూపిస్తాను” అని మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆమె 27 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించారు. చివరకు ఒకప్పుడు ఇసుకతో నిండిన ప్రాంతాన్ని పచ్చని అడవిగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
ఈ మహత్తర లక్ష్యం పూర్తయిన తర్వాత, తనకు సాయం చేసిన రోనాల్డ్ సాకోల్స్కీని వెతకడం ప్రారంభించారు ఇన్ యుజెన్. అప్పట్లో జ్ఞాపకంగా దాచుకున్న పాత డాలర్ నోటును ఆధారంగా తీసుకుని ఆన్లైన్ ద్వారా ఆయన కోసం అన్వేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన విద్యార్థుల సహకారంతో కొద్ది రోజులకే సాకోల్స్కీని గుర్తించారు. అనంతరం వీడియో కాల్ ద్వారా పచ్చని అడవిగా మారిన మౌవుసు ప్రాంతాన్ని చూపించారు. ఒకప్పుడు ఎడారిగా ఉన్న ప్రాంతం పూర్తిగా పచ్చదనంతో నిండిపోవడం చూసిన సాకోల్స్కీ భావోద్వేగానికి గురయ్యారు. “ఇది నిజంగా అద్భుతం” అంటూ ఆమె కృషిని ప్రశంసించారు.
తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా, ఆర్థిక సహాయాన్ని పూర్తిగా ప్రకృతి కోసం వినియోగించడం గొప్ప విషయమని సాకోల్స్కీ కొనియాడారు. త్వరలోనే చైనాకు వచ్చి స్వయంగా ఆ అడవిని చూడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి కోసం అంకితభావంతో కృషి చేస్తే అసాధ్యమనే మాట ఉండదని ఇన్ యుజెన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. చైనా – అమెరికా దేశాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రారంభమైన ఈ పచ్చని స్నేహం ఇప్పుడు ప్రపంచ ప్రజల మనసులను గెలుచుకుంటోంది.
ALSO READ: గాలిలో విమానం.. ఇంధనం ఖాళీ..!