హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 11 కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మూడేళ్ల కోర్సుల్లో చివరి ఏడాది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతూ నెలకు రూ.7 వేల స్టైపెండ్ అందుకుంటారు. ఈ ఏడాది మొత్తం సీట్లను 11 వేలకు పెంచగా.. కనీసం 8 వేల సీట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ పరిశ్రమలతో ఈ మేరకు అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి.రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉపాధి లభించాలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ కీలక అడుగులు వేసింది.
విద్యార్థులకు సంప్రదాయ విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ఉద్యోగ శిక్షణ ఇచ్చేందుకు అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కింద కొత్తగా 11 కోర్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రాబోయే విద్యాసంవత్సరం (2026-27) నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి, సీఐఐ విద్యా సలహాదారు శేఖర్‌రెడ్డిలతో కలిసి కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.ఈ మూడేళ్ల కాలపరిమితి గల డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ చివరి సంవత్సరం అంతా క్షేత్రస్థాయిలో వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ప్రత్యక్షంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ అప్రెంటిస్‌షిప్ సమయంలో విద్యార్థులకు ఆర్థిక భరోసాగా నెలకు రూ.7 వేల చొప్పున స్టైపెండ్ కూడా చెల్లిస్తారు.
ఈ వినూత్న కోర్సుల ద్వారా అప్రెంటిస్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులలో దాదాపు 80 నుండి 90 శాతం మందికి వారు శిక్షణ పొందిన సంస్థల్లోనే శాశ్వత ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలు ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలతో ఉన్నత విద్యాశాఖ అధికారికంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది.విద్యార్థులు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ ద్వారా ఈ ఏఈడీపీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. గత విద్యాసంవత్సరంలో 16 రకాల కోర్సులకు గాను 6 వేల సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 1,770 మంది మాత్రమే చేరారు.
అయితే ఈసారి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను చేర్చడంతో పాటు మరో 5 వేల సీట్లను అదనంగా పెంచారు.
దీంతో మొత్తం సీట్ల సంఖ్య 11 వేలకి చేరగా.. ఈ విద్యాసంవత్సరంలో కనీసం 8 వేల సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 94 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 27 రకాల ఏఈడీపీ కోర్సులు అందుబాటులో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన 11 కోర్సుల వివరాలను పరిశీలిస్తే.. బీఎస్సీ విభాగంలో ఎలక్ట్రానిక్స్ న్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, ఈ-మొబిలిటీ అండ్ బ్యాటరీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్‌వేర్, హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ, డెయిరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్‌మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి 8 రకాల అధునాతన కోర్సులు ఉన్నాయి.
అలాగే.. బీకాం విభాగంలో బిజినెస్ ఎనలిటిక్స్ కోర్సును, బీఏ విభాగంలో యానిమేషన్ అండ్ వీఎఫ్‌ఎక్స్, ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ అనే 2 కొత్త కోర్సులను మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రవేశపెట్టారు