రాజమండ్రి, క్రైమ్మిర్రర్: అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడం లేదు, నేతలపై వస్తున్న ఆరోపణలపై రియాక్ట్ కావడం లేదు అంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం గట్టిగానే చేసారు పవన్. అలాగే జనసేన ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కూడా టైం కేటాయిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక దోపిడీ ఆరోపణల వివాదం లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ను తన వద్దకు పిలిపించుకున్న పవన్ కళ్యాణ్ చెడా మడా క్లాస్ పీకారని సమాచారం. శ్రీధర్ తనపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఒక మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆమె వరుసగా కొన్ని వీడియోలు రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అంటూ విపక్షాలు కూడా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసాయి. దీనిపై అన్ని నివేదికలు చెప్పించుకున్న తర్వాత శ్రీధర్ ని పిలిపించుకున్న పవన్ ఆయన వివరణ తీసుకున్నారు. నైతిక పరమైన అంశాల్లో ఇలాంటి ఆరోపణ వస్తే సహించేది లేదంటూ గట్టిగా చెప్పడం తో శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. ఇక పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సైతం ఆ మధ్య చంద్రబాబు పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ లో బాలరాజు కి క్లాస్ పీకారు. కూటమి ప్రతిష్టను దెబ్బతీసే ఎలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయొద్దు అంటూ ఏవైనా విషయాలు ఉంటే పార్టీలోనే చర్చించాలి తప్ప లేనిపోని వివాదాలు సృష్టించొద్దని గట్టిగా చెప్పారు.
చిర్రి బాలరాజు పై వస్తున్న ఆరోపణలకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ టైం ఇచ్చారు. గోదావరి జిల్లాలో వరుస పర్యటనలు మొదలుపెట్టారు పవన్. గోదావరి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కు జనసేనకు ఉన్న పట్టు చాలా ముఖ్యమైనది. స్థానికంగా ఉన్న నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ జోష్ నింపడానికి పవన్ ఈ పర్యటన ఉపయోగించుకోబోతున్నారు. అలాగే పుష్కరాల పనులు నేపథ్యంలో రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరీక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 24 సీట్లు పోటీ చేసిన జనసేనను రాబోయే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు కు పెంచేలా వ్యూహం అయితే రెడీ చేస్తున్నారు జనసేనాని. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి కలిసే పోటీ చేస్తుంది అని ఇప్పటికే పలుమార్లు హింట్ ఇచ్చారు పవన్.
అయితే దీనిపై జనసేన క్షేత్రస్థాయి అభిమానుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అని పవన్ వరకూ నివేదికలు వెళ్లాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే యువకులను, తనకున్న అభిమానులను, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను సంతృప్తిపరిచేలా పవన్ కళ్యాణ్ తన పర్యటనలు రెడీ చేస్తున్నారు. అందుకే ఒకవైపు ఇలాంటి టూర్స్ వేస్తూనే మరోవైపు పార్టీలో ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొంటున్న నాయకులకు క్లాసులు పీకుతూ పార్టీని రిపేర్ చేసే పనిలో పడ్డారు జనసేనాని.విపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కామెంట్ చేయడం ఈజీయే కానీ ఎంత వద్దన్నా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ తన పార్టీపై ప్రజల్లో భరోసా కల్పించే ప్రయత్నంలో పడ్డారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.