క్రైమ్ మిర్రర్, వైరల్:- సాధారణంగా టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం భారతీయ రైల్వే నిబంధనలకు విరుద్ధం. అలాంటి సమయంలో తనిఖీల్లో పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైల్వే ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. టికెట్ తీసుకునే సమయం లేకపోయినా కొన్ని నిబంధనలు పాటిస్తే ప్రయాణం కొనసాగించవచ్చు.రైల్వే నిబంధనల ప్రకారం అత్యవసరంగా రైలులో ఎక్కాల్సి వస్తే ముందుగా ప్లాట్ఫాం టికెట్ తీసుకోవడం మంచిది. ఈ టికెట్ ద్వారా మీరు ఏ స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించారో నమోదు అవుతుంది. తర్వాత రైలులో ఎక్కిన వెంటనే టీటీఈని సంప్రదించి పరిస్థితిని వివరించాలి.
మీరు వెళ్లాల్సిన గమ్యస్థానం ఏదో చెప్పిన తర్వాత.. ఆ దూరానికి సంబంధించిన టికెట్ ఛార్జీని టీటీఈకి చెల్లించాలి. చెల్లింపు పూర్తయ్యాక ఆయన అధికారిక రసీదు ఇస్తారు. ఆ రసీదు మీ ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది. దీంతో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని ఎలాంటి ఇబ్బంది ఉండదు.అయితే ఈ విధానంలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇలా ఎక్కిన వారికి రిజర్వేషన్ సీటు కచ్చితంగా వస్తుందనే హామీ ఉండదు. రైలులో ఖాళీ సీట్లు ఉంటే టీటీఈ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. లేదంటే జనరల్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణించాల్సి రావచ్చు.
ముఖ్యంగా టికెట్ లేకుండా రైలెక్కి.. టీటీఈకి సమాచారం ఇవ్వకుండా ప్రయాణిస్తే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తనిఖీల్లో పట్టుబడితే జరిమానాతో పాటు టికెట్ ఛార్జీ కూడా వసూలు చేస్తారు. అందుకే రైలెక్కిన వెంటనే టీటీఈని కలవడం అవసరం.ప్రస్తుతం చాలా మంది ఐఆర్సీటీసీ యాప్ ద్వారా క్షణాల్లోనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. రైల్వే కౌంటర్లలో కూడా టికెట్ సౌకర్యం అందుబాటులో ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముందుగానే టికెట్ తీసుకోవడం ఉత్తమం. కానీ నిజంగా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. రైల్వే నిబంధనలు తెలుసుకుని సరైన విధంగా ప్రయాణిస్తే ఇబ్బంది లేకుండా గమ్యానికి చేరుకోవచ్చు.