Homeలైఫ్ స్టైల్Gen Zలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. మెడ, నడుము నొప్పులకు అసలు కారణాలివే!

Gen Zలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. మెడ, నడుము నొప్పులకు అసలు కారణాలివే!

క్రైమ్ మిర్రర్, హెల్త్ న్యూస్:- అమ్మా.. తలనొప్పిగా ఉంది, మెడ నొప్పిగా ఉంది అంటూ యువత చెబుతుంటే.. రోజంతా ఫోన్ చూస్తే ఇలానే ఉంటుంది అనే మాట ఇప్పుడు చాలా ఇళ్లలో కామన్ అయిపోయింది. కానీ అది కేవలం మాట మాత్రమే కాదు.. అందులో నిజం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి వంటి సమస్యలు పెద్దవారిలోనే కాదు.. Gen Zలో కూడా వేగంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా మొబైల్, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి గడపడం.. సరైన భంగిమలో కూర్చోకపోవడం.. వ్యాయామం లేకపోవడం.. నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలు శరీరంపై ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే శరీరం అలసిపోవడం, తరచూ నొప్పులు రావడం ఇప్పుడు సాధారణంగా మారిపోతోంది.

మెడ నొప్పికి ప్రధాన కారణం ఫోన్ చూస్తూ తల వంచి ఎక్కువసేపు ఉండటమే. అలాగే ల్యాప్‌టాప్ ముందు వంగి కూర్చోవడం వల్ల కూడా మెడపై ఒత్తిడి పెరుగుతుంది. వీడియో గేమ్స్, సోషల్ మీడియా, టెక్స్టింగ్ లాంటి అలవాట్లు మెడ కండరాలను బలహీనపరుస్తాయి. మొదట చిన్న అసౌకర్యంగా మొదలైనా.. తర్వాత అది తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.ఇక వ్యాయామం లేకపోవడం కూడా మరో పెద్ద కారణం. బయట నడక, ఆటలు తగ్గిపోవడంతో రోజంతా ఒకేచోట కూర్చునే అలవాటు పెరిగింది. దీంతో కండరాలు బలహీనపడి.. నడుము, కాళ్లపై ప్రభావం పడుతోంది.ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కాళ్లలో రక్తప్రసరణ కూడా సరిగా జరగదు. దీంతో కాళ్ల నొప్పి, బలహీనత కనిపిస్తుంది. స్ట్రెచింగ్ లేకపోవడం.. అసౌకర్యంగా ఉండే షూస్ వేసుకోవడం.. విటమిన్ D, కాల్షియం లోపం కూడా ఈ సమస్యలకు కారణం కావచ్చు.

మానసిక ఒత్తిడి కూడా శరీరంపై ప్రభావం చూపుతుంది. చదువు, కెరీర్, సోషల్ మీడియాలో పోలికల వల్ల చాలామంది యువత ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మెడ, భుజాల దగ్గర కండరాలు బిగుసుకుపోయి నొప్పి పెరుగుతుంది. రాత్రిళ్లు ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల నిద్ర సరిగా లేకపోవడం కూడా సమస్యను మరింత పెంచుతుంది.

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని చిన్న మార్పులు చాలు. మొబైల్, ల్యాప్‌టాప్ వాడేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. ప్రతి గంటకోసారి లేచి కాసేపు నడవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా యోగా చేయాలి. రాత్రిళ్లు ఫోన్ వాడకం తగ్గించి.. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.
టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేసింది. కానీ అదే టెక్నాలజీని అతిగా వాడితే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే చిన్న వయసులో వచ్చే ఈ నొప్పులను తేలికగా తీసుకోకుండా.. ముందుగానే జాగ్రత్త పడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక:- ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఎక్కువకాలం ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు