Homeరాజకీయంయూపీ ఎన్నికలపై మాయావతి స్ర్టాటజీ.. విజయమే లక్ష్యంగా పావులు.!

యూపీ ఎన్నికలపై మాయావతి స్ర్టాటజీ.. విజయమే లక్ష్యంగా పావులు.!

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్ :- ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఫైర్‌ బ్రాండ్‌ ఉమెన్‌గా పేరుగాంచిన మాయవతి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2007లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆమె.. ఆ తరువాత రాజకీయంగా వెనుకబడిపోయారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా బీఎస్పీని విస్తరించడంపై దృష్టి సారించిన ఆమె.. ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బలమైన ముద్రను వేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి యూపీలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె ప్రత్యేకంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. 2017లో జరిగిన ఎన్నికల్లో అత్యంత దారుణంగా 17 సీట్లకే పరిమితమైన బీఎస్పీ.. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దారుణమైన ఫలితాలను చవి చూసింది. 12.09 శాతం ఓటింగ్‌ సాధించి రెండు సీట్లకు పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో బీఎస్పీ ప్రభావం పూర్తిగా లేకపోయినట్టైంది.

సోషల్‌ ఇంజనీరింగ్‌పై దృష్టి..

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మాయావతి సరికొత్త ఫార్ములాతో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. 2007లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫార్ములాతో ఈ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. అప్పట్లో ఈ ఫార్మాలాతో దళితులు, బ్రాహ్మణులు, ముస్లింలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మాయవతి విజయం సాధించడంతోపాటు అధికారాన్ని దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాతో బరిలోకి దిగేందుకు ఆమె వ్యూహారచన చేస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫార్ములాతో ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆమె నాయకులు స్పష్టం చేశారు. దీంతో ఆమెమరోసారి తనకు అధికారాన్ని కట్టబెట్టిన ఫార్ములాతో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఇకపోతే, 2027 ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగేందుకు మాయవతి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు స్పష్టతను కూడా నాయకులు, కేడర్‌కు ఇచ్చారు. అధికారంలోకి రాకపోయినా కింగ్‌ మేకర్‌గా అయినా నిలుస్తామనే యోచనలో ఆమె ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఎంత వరకు ఉంటుందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు