Homeఅంతర్జాతీయంJaishankar: అమెరికా వీసా మార్పులతో భారత్ కు ఇబ్బందులు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Jaishankar: అమెరికా వీసా మార్పులతో భారత్ కు ఇబ్బందులు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

అమెరికా వీసా విధానంలో తాజా మార్పులపై మార్పులపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రీన్‌ కార్డులు, హెచ్‌1బీ వీసాల జారీ విధానంలో వచ్చిన మార్పులు అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, స్థిరపడాలని భావిస్తున్న భారతీయులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు.

భారత్‌ పర్యటనలో మార్కో రుబియో

భారత్‌ పర్యటనలో ఉన్న మార్కో రుబియోతో జైశంకర్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. అమెరికా వీసా విధానాన్ని మరోసారి సమీక్షించాలని భారత్‌ కోరినట్లు జైశంకర్‌ వెల్లడించారు. అమెరికాలో పనిచేసే లేదా చదువుకునే భారతీయులకు హెచ్‌1బీ వీసాలు, గ్రీన్‌కార్డులు చాలా ముఖ్యమైనవి. అయితే, ఇటీవల అమెరికా తీసుకొచ్చిన కొన్ని మార్పుల కారణంగా వీసాల ప్రక్రియ మరింత కఠినంగా మారిందని భారతీయుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ విషయాన్ని భారత్‌ అధికారికంగా అమెరికా దృష్టికి తీసుకెళ్లింది.

మార్కో రుబియో ఏమన్నారంటే?

దీనిపై స్పందించిన మార్కో రుబియో, అమెరికా వీసా మార్పులు తమ దేశ వలస విధానంలో భాగమని చెప్పారు. అవి ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయాలు కావని స్పష్టం చేశారు.

ఇక సమావేశంలో ఇంధన రంగం, ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ సహకారం, వ్యూహాత్మక సాంకేతికతలు, అరుదైన ఖనిజాల వినియోగం, ప్రజల మధ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై కూడా చర్చించినట్లు ఇద్దరు నేతలు తెలిపారు.  అంతర్జాతీయ శాంతి, భద్రత విషయంలో భారత్‌ అనుసరిస్తున్న ఐదు ముఖ్య సూత్రాలను కూడా జైశంకర్‌ వివరించారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడం, సముద్ర మార్గ వాణిజ్యానికి ఆటంకాలు లేకుండా చూడటం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, మార్కెట్లు లేదా అరుదైన వనరులను ఒత్తిడి సాధనాలుగా ఉపయోగించకుండా నిరోధించడం, ప్రపంచ సరఫరా వ్యవస్థలో నమ్మకమైన భాగస్వామ్యాలను కొనసాగించడం భారత్‌ విదేశాంగ విధానంలో కీలక భాగాలని ఆయన తెలిపారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు