HomeజాతీయంFuel Measurement Rules: పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం!

Fuel Measurement Rules: పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం!

వాహనదారులకు పెట్రోల్‌ బంకుల్లో సరైన కొలతలతో ఇంధనం అందేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది. ఇంధనం నింపేటప్పుడు కొలతల్లో మోసాలు జరగకుండా, వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లీగల్‌ మెట్రాలజీ నిబంధనలు-2013లో కీలక సవరణలు చేసింది.

సీఎన్‌జీ, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్‌ కేంద్రాలకూ విస్తరణ

ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ పంపిణీ యంత్రాల తనిఖీలకే పరిమితమైన ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాల (GATC) బాధ్యతలను ఇప్పుడు మరింత విస్తరించారు. కొత్త మార్పులతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సీఎన్‌జీ, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్‌ ఇంధన పంపిణీ యంత్రాలను కూడా ఈ కేంద్రాలు తనిఖీ చేసి ధ్రువీకరించనున్నాయి. అంటే, భవిష్యత్తులో ఏ రకమైన ఇంధనం వాడినా, వినియోగదారులకు సరైన పరిమాణం అందుతోందా? లేదా? అనే విషయాన్ని అధికారికంగా పరీక్షించే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రిక్‌, గ్రీన్‌ ఫ్యూయల్‌ వినియోగం పెరగడంతో..

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌, గ్రీన్‌ ఫ్యూయల్‌ వాహనాల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరుగుతున్నందున వాటి పంపిణీ యంత్రాలపై కూడా కఠిన పర్యవేక్షణ అవసరమని అధికారులు భావించారు.

తాజా సవరణలతో జీఏటీసీలు తనిఖీ చేసే తూనికలు, కొలతల పరికరాల సంఖ్య 18 నుంచి 23కు పెరిగింది. దీంతో వినియోగదారుల హక్కులకు మరింత రక్షణ లభించనుంది. అలాగే పెట్రోల్‌ బంకుల్లో తక్కువ ఇంధనం నింపడం, కొలతల్లో తేడాలు చూపించడం వంటి ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంధన పంపిణీ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో పాటు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలు అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు