Homeతెలంగాణరైతులకు భారీ గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యాన్ని కొంటాం, మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

రైతులకు భారీ గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యాన్ని కొంటాం, మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసి, వెంటనే మిల్లులకు తరలించి బాయిల్డ్ రైస్‌గా మారుస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం నెపంతో ఒక్క రైతును కూడా నష్టపోనివ్వబోమని ఆయన భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరుతో రైతులకు కోతలు విధిస్తే మిల్లర్లతో పాటు సంబంధిత కొనుగోలు సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

ఆదివారం ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల రాష్ట్ర కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఆడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణరావుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో హైలెవెల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు చేరుకుని కాంటా (తూకం) కోసం ఎదురుచూస్తున్న 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు రూ.45 వేల కోట్ల చెల్లింపులు

ఈ ఒక్క సంవత్సరంలోనే ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి రికార్డు స్థాయిలో రూ.45 వేల కోట్ల చెల్లింపులు చేసిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియలో ట్యాగింగ్ విధానాన్ని వేగంగా పూర్తి చేస్తే రైతులకు మరింత త్వరగా డబ్బులు అందుతాయన్నారు. అవసరమైతే ఆదివారం రోజున కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి గాను రూ.8,749 కోట్లను ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

గన్నీ బ్యాగుల కొరత లేదు: వలస కార్మికుల వల్లే కొంత జాప్యం

రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, ప్రతిపక్షాలు కేవలం రాజకీయ రాద్ధాంతం చేస్తూ రైతాంగంలో గందరగోళం సృష్టించడానికే ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులేనని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు వారు స్వగ్రామాలకు వెళ్లి ఇంకా తిరిగి రాకపోవడం వల్లే లోడింగ్ ప్రక్రియలో కొంత జాప్యం జరిగిందని వివరించారు.

రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి

ప్రస్తుత రబీ సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత పారదర్శకంగా, రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. తాజా అంచనాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందని చెప్పారు.

“ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత సునిశితమైనది. ఎక్కడా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.”

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చివరగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తోందని, మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్రం పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరపడం లేదని మంత్రి విమర్శించారు. కేంద్రం తీసుకోగా మిగిలిన ధాన్యాన్నంతటినీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో కొనుగోలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

also read: తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌లో టెన్షన్ వాతావరణం.. అతని రాజీనామా హాట్ టాపిక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు