-
కమలాపురం లేదా కడప అసెంబ్లీ స్థానం నుంచి..
-
ఇప్పటి నుంచే పావులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైఎస్ షర్మిల ఈసారి రూటు మార్చారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రెండు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. అది కూడా కడప జిల్లాలో. అందులో ఒకచోట 2029 ఎన్నికల్లో పోటీ చేసి.. అసెంబ్లీలో అడుగు పెట్టాలని గట్టి ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచి దానికి సంబంధించిన వ్యూహరచన ప్రారంభించినట్లు సమాచారం. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పై గురిపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. తమ కుటుంబ ఓటు బ్యాంకుకు తోడు వైసీపీలో అసంతృప్తి వర్గాన్ని తిప్పుకుంటే.. సునాయాస విజయం దక్కుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్న ఎంపీ అభ్యర్థిగా…
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు షర్మిల. గట్టి పోటీ ఇచ్చారు. దాదాపు 1,50,000 కు పైగా ఓట్లను సొంతం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డిని ఓడించినంత పని చేశారు. ఆయన మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగారు. త్రిముఖ పోటీలో నెగ్గారు అవినాష్ రెడ్డి. భూపేష్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. షర్మిల మూడో స్థానంలో నిలిచిన దాదాపు రెండు లక్షల వరకు ఓట్లను సొంతం చేసుకున్నారు అంటే బలం ఏ స్థాయిలో చూపించారో అర్థం అవుతోంది. అందుకే ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారన్న అంచనాలు ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు ప్రస్తావించడం లేదన్న విమర్శ ఉంది. తనను గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లి గట్టి వాదనలు వినిపిస్తానని షర్మిల ప్రజలను కోరే అవకాశం ఉంది.
కమలాపురం ఎందుకంటే…
షర్మిల ప్రధానంగా కమలాపురం నియోజకవర్గం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అది తన తల్లి విజయమ్మ పుట్టినిల్లు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మేనమామ రవీంద్రారెడ్డి అక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలిచే ఛాన్స్ ఉంటుందని ఓ సర్వే ద్వారా షర్మిల తెలుసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు షర్మిల కడప అసెంబ్లీ నియోజకవర్గం పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఇప్పటివరకు వైసీపీ తరఫున అక్కడ అంజాద్ బాషా ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆ సీటుపై కడప మాజీ మేయర్ సురేష్ బాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. దీంతో అధికార పార్టీలో విభేదాలు ఉన్నాయని.. అటువంటి చోట రంగంలోకి దిగితే అసంతృప్తి నేతలు తనకు సహకారం అందిస్తారని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే షర్మిల కడప జిల్లాలో రెండు సీట్లపై ఫోకస్ పెడుతుండడం వైసిపికి మింగుడు పడని అంశం.