-
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్ఠికరణ
-
రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్ కు అమిత్ షా క్లాస్ పీకినట్లు ఇంటర్వ్యూలో వెల్లడి
-
ముప్పేట దాడితో వెనక్కి తగ్గిన రాజకీయ విశ్లేషకుడు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితి చోటు చేసుకుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. మూడు రోజుల కిందట ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు కాదని.. ఆయనతో స్నేహం తాత్కాలికమేనని.. జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నట్టు కామెంట్స్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని కోరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అమిత్ షా క్లాస్ పీకినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన అంశాలను బయటపెట్టారు. అయితే దీనిపై ముప్పేట దాడి జరగడం.. ఆపై పోలీసు కేసులు నమోదవుతుండడం.. తన క్రెడిబిలిటీ తగ్గుతుందన్న భయంతో ఆయన బే షరతుగా ఆ కామెంట్స్ ను వెనక్కి తీసుకోవడం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మంచి విశ్లేషకుడిగా పేరు…
సమకాలీన రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటారు ప్రొఫెసర్ నాగేశ్వర్. గతంలో ప్రొఫెసర్ గా ఎంతోమందికి బోధన సాగించిన చరిత్ర అయినది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పాఠాలు అంటే విద్యార్థులు ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆయన ఇంటర్వ్యూలకు ఎనలేని ఆదరణ ఉండేది. ఆయన డిబేట్లకు హాజరైతే చాలు టీవీల ముందు వాలిపోయేవారు. కానీ ఆయన ఇటీవల చేస్తున్న విశ్లేషణలో రాజకీయ ప్రేరేపితం ఉందన్న విమర్శలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడానికి ఎక్కువ మంది తప్పు పట్టారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం దానిని సమర్థించారు. ఆ ఒక్కటే కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆయన సానుకూలంగా విశ్లేషణ చేస్తారన్న విమర్శ ఉంది.
ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడి…
ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం అంటూ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. మొన్న ఆ మధ్యన మంత్రి నాదెండ్ల మనోహర్ ను తీసుకొని ఏపీ డిప్యూటీ సీఎం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారని.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలని కోరినందుకు క్లాస్ పీకారని చెప్పుకొచ్చారు. పైగా చంద్రబాబు ఇనిస్టాంట్ ఫ్రెండ్ అని… జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అని చెప్పినట్లు.. ఆ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో జనసేన కోర్ కమిటీలో చెప్పించినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు.
ఆధారాలు లేని మాటలతో.. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారంటూ నాదేండ్ల మనోహర్ గట్టిగానే బదులిచ్చారు. అసలు జనసేనకు కోర్ కమిటీ వ్యవస్థ లేనప్పుడు ఎలా చెబుతామని ప్రశ్నించారు. ఇంకోవైపు జనసేన నేతలు ఎక్కడికక్కడే ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. 24 గంటల పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు డెడ్ లైన్ విధించారు. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. అయితే అనవసరంగా రాజకీయ వివాదాల జోలికి వెళ్లి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులు అడ్డంగా బుక్ అవుతుండడం పై మాత్రం ఎక్కువ మంది బాధపడుతున్నారు. అటువంటివారు రాజకీయ ప్రేరేపిత విశ్లేషణలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.