క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. అయితే టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అయింది. డ్రాగన్ సినిమాకు సలార్, కేజీఎఫ్ సినిమాలతో ఏదో ఒక కనెక్షన్ ఉంటుందని, ప్రశాంత్ నీల్ మరో సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారని అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు.
కానీ తాజాగా ఈ వార్తలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. డ్రాగన్ సినిమాకు సలార్ తో కానీ, కేజీఎఫ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా పూర్తిగా కొత్త కథతో, స్వతంత్ర కథాంశంతో తెరకెక్కుతోందని వెల్లడించారు.టీజర్ చూసిన తర్వాత చాలా మంది అభిమానులు క్రాస్ ఓవర్ ఎలిమెంట్స్ ఉంటాయని భావించారని.. కానీ అలాంటి ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ప్రశాంత్ నీల్ తెలిపారు. దీంతో డ్రాగన్ కూడా ఒక యూనివర్స్‌లో భాగమే అనుకున్న ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ ఎదురైందనే చెప్పాలి.
ఇదే విషయంపై ఆయన మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను సినిమాలు డబ్బు కోసం చేస్తాను. ఒకవేళ సినిమాటిక్ యూనివర్స్‌లు, క్రాస్ ఓవర్ కథలు ప్లాన్ చేస్తే ఒక్కో సినిమా పూర్తి చేయడానికి ఐదేళ్లు పడుతుంది అంటూ నవ్వుతూ చెప్పారు. అలాంటి కథలు చేయడం ఇష్టం లేదని కాదు కానీ, ప్రస్తుతం డ్రాగన్ ను పూర్తి స్థాయి కమర్షియల్, వైవిధ్యమైన చిత్రంగా తెరకెక్కించాలనుకుంటున్నానని వివరించారు.ఇప్పటికే డ్రాగన్ టీజర్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. ఎన్టీఆర్ లుక్, ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ విజువల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా.. ఈ సినిమాపై అభిమానుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.