దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో ఆర్థిక భారం మోపే అవకాశం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లులు మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యుత్ టారిఫ్ విధానంలో కీలక మార్పులు చేయడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులపై ప్రస్తుతం విధిస్తున్న స్థిర ఛార్జీలను భారీగా పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, సంపన్న కుటుంబాలు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడంతో విద్యుత్ సంస్థల నుంచి కొనుగోళ్లు తగ్గుతున్నాయి. దీని ప్రభావం నేరుగా డిస్కంల ఆదాయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం తక్కువైనా స్థిర ఆదాయం రావాలనే ఉద్దేశంతో కేంద్రం కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.
ఒక్కసారిగా ప్రజలపై భారీ భారం మోపకుండా దశలవారీగా స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ సూచించింది. 2030 నాటికి గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల నుంచి మొత్తం స్థిర వ్యయాల్లో 25 శాతం వరకు వసూలు చేయాలని ప్రతిపాదించింది. ఇక పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి 100 శాతం స్థిర ఛార్జీలను వసూలు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో నెలవారీ విద్యుత్ బిల్లుల్లో స్థిర ఛార్జీల భాగం గణనీయంగా పెరగనుంది. అంటే విద్యుత్ వినియోగం తగ్గించినా, వినియోగదారులు నిర్దిష్ట స్థిర ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం డిస్కంల ఆదాయం ప్రధానంగా విద్యుత్ వినియోగ ఛార్జీలపై ఆధారపడి ఉంది. స్థిర ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో వినియోగం తగ్గినప్పుడు డిస్కంల ఆదాయం కూడా పడిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా స్థిర ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యుత్ అథారిటీ అభిప్రాయపడుతోంది.
ప్రస్తుతం విద్యుత్ కంపెనీలకు వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, విద్యుత్ సరఫరా నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు వంటి ఖర్చులకు వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల వినియోగం భారీగా పెరిగింది. అనేక కంపెనీలు తమకు కావాల్సిన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటూ, అవసరమైనప్పుడు మాత్రమే గ్రిడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. దీని కారణంగా విద్యుత్ సంస్థల ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో రూఫ్‌టాప్ సోలార్, నెట్ మీటరింగ్ వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ విధానాన్ని తీసుకురావాలని కేంద్ర విద్యుత్ సంస్థ సిఫార్సు చేసింది. గ్రిడ్‌ను ఉపయోగించే ప్రతి వినియోగదారు దాని నిర్వహణ ఖర్చులకు కూడా భాగస్వామ్యం కావాలని కొత్త నిబంధనలు తీసుకురావాలని భావిస్తోంది. ఈ చర్యల వల్ల విద్యుత్ కంపెనీలపై ఉన్న ఆర్థిక భారం కొంత మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే మరోవైపు సాధారణ ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. అస్సలు మిస్ చేసుకోవద్దు..