మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం చివరికి జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయగా, మే 18న విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ అగ్రస్థానంలో కొనసాగుతూ భారీ స్థాయిలో వ్యూస్ సాధిస్తోంది. సుమారు రూ.300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అగ్ర తారాగణం నటించడం విశేషంగా మారింది.
జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే దివ్యేందు శర్మ, ప్రముఖ నటుడు జగపతిబాబు, హాస్యనటుడు సత్య తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా నటీనటుల పారితోషికాల గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ చిత్రం కోసం రూ.100 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఆయన సినీ జీవితంలోనే అత్యధిక మొత్తం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ చిత్రాల కోసం ఆయన సుమారు రూ.50 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రంతో ఆయన పారితోషికం మరో స్థాయికి చేరిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇటీవల దేవర తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న జాన్వీ కపూర్‌కు ఈ చిత్రం కోసం సుమారు రూ.6 కోట్ల వరకు పారితోషికం అందినట్లు సమాచారం. అలాగే మీర్జాపూర్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు శర్మ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఆయనకు రూ.7 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హీరో రామ్ చరణ్ తర్వాత అత్యధిక పారితోషికం దర్శకుడు బుచ్చిబాబు సనాదేనని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు ఆయనకు సుమారు రూ.30 కోట్ల వరకు పారితోషికం అందినట్లు సమాచారం.
అదేవిధంగా ప్రముఖ నటుడు జగపతిబాబుకు రూ.5 కోట్లు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌కు రూ.10 కోట్ల వరకు పారితోషికం అందినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు కూడా భారీ స్థాయిలో పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. భారీ వ్యయం, అగ్ర తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.
ALSO READ: సీఐ అరాచకం.. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే గర్భవతిని చేశాడు..