-
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు సైతం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. కీలకమైన మూడు నిర్ణయాలను తీసుకుంది. కొత్త పింఛన్లతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీకి సంబంధించి తీపి కబురు చెప్పింది. ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బడ్జెట్లో రెండు లక్షల పెన్షన్లతోపాటు రేషన్ కార్డుల పంపిణీకి నిధులు కేటాయించారు. ఇప్పుడు తాజాగా ఆ రెండింటిపై ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. దరఖాస్తులు అర్హతలపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండు నుంచి 2 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ప్రకటించారు.
దరఖాస్తులు సైతం…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరు తో పాటు రేషన్ కార్డులపై ప్రకటనలు ఇస్తూ వచ్చింది. దరఖాస్తుల స్వీకరణ కూడా జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు దాటుతున్న క్రమంలో కాంగ్రెస్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు రెండో విడతకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అన్నింటికీ మించి పింఛన్ల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. లక్షలాదిమంది దరఖాస్తుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా రెండు లక్షల మందికి…
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు 42 లక్షల మందికి పైగా ఉన్నారు. కొత్తగా 2 లక్షల మందికి ఆమోదం ఇచ్చినట్లు మంత్రి చెబుతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో రెండు లక్షల పెన్షన్లకు నిధులు కేటాయించి.. జూన్ 2 నుంచి అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు వంటి వర్గాలకు కొత్తగా పెన్షన్ దక్కనుంది.
ప్రస్తుతం వృద్ధులు వితంతువులు మొదలైన వారికి నెలకు రూ.2016, దివ్యాంగులకు రూ.4016 అందిస్తోంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెన్షన్ ను 4000 రూపాయలకు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. అది ఎంతవరకు అమలు కాలేదు. అయితే ఇప్పుడు రేషన్ కార్డులతో పాటు పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభ పరిణామం.