అహ్మదాబాద్‌లో వెలుగుచూసిన రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మోసం వెనుక భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉన్నట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల నుంచి సుమారు 4,500 సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, రూటర్‌తో పాటు ఒకేసారి అనేక సిమ్‌లను నిర్వహించగల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
సీనియర్ అధికారి పేరుతో వాట్సాప్ మెసేజ్
జూన్‌లో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగికి వాట్సాప్‌లో అతని సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఓ సందేశం వచ్చింది. అది నిజమైన ఆదేశమని భావించిన ఉద్యోగి, సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు ఏకంగా రూ.1.5 కోట్లు బదిలీ చేశాడు. అనంతరం మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసును వెంటనే చేపట్టిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని సుమారు రూ.1.3 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ అలీ పియాదా, ఇంజాముల్ అనే ఇద్దరి ప్రమేయం బయటపడింది. వారిని ట్రాన్సిట్ వారెంట్లపై గుజరాత్‌కు తీసుకొచ్చి విచారించారు.
వేలాది సిమ్ కార్డులు.. భారీ నెట్‌వర్క్
నిందితుల వద్ద లభించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. సుమారు 4,500 సిమ్ కార్డులు, పలు సిమ్‌లను ఒకేసారి నిర్వహించేందుకు ఉపయోగించే పరికరాలు, మొబైల్ ఫోన్లు, రూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా గత కొన్నేళ్లలో ఈ ముఠా ఆన్‌లైన్ గేమింగ్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు సుమారు 21 వేల ఓటీపీలను అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం రూ.21 లక్షలకు పైగా సంపాదించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
చైనా మాల్‌వేర్.. పాకిస్థాన్ కాల్ సెంటర్‌తో లింకులు
సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు మరో కీలక విషయాన్ని గుర్తించారు. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు రూపొందించిన మాల్‌వేర్‌ను ఈ మోసాల్లో ఉపయోగించినట్లు తేలింది. ఈ ఆపరేషన్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న ఓ కాల్ సెంటర్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది.
అలాగే చైనా ఆధారిత వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సేవలను ఉపయోగించి బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
‘సైబర్ క్రైమ్ యాజ్ ఎ సర్వీస్’
ఈ ముఠా గత నాలుగైదేళ్లుగా విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు పోలీసులు వెల్లడించారు. డమ్మీ సిమ్ కార్డులు, ఓటీపీలు, వాట్సాప్ ఖాతాలను అందిస్తూ ‘సైబర్ క్రైమ్ యాజ్ ఎ సర్వీస్’ తరహాలో కార్యకలాపాలు సాగించినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు.
మరోవైపు, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డుల్లో కొన్ని దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో నమోదైన 251 సైబర్ క్రైమ్ ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ముఠా కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
