క్రైమ్ మిర్రర్, జాతీయం:- దేశ ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. గత ఐదు రోజుల్లో ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. తాజా పెంపుతో పెట్రోల్‌పై లీటర్‌కు సుమారు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసల వరకు భారం పడింది.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.98.64కు చేరుకోగా, డీజిల్ ధర రూ.91.58కు పెరిగింది. ఇటీవలే రూ.3 వరకు పెంపు చేసిన నేపథ్యంలో వరుసగా మరోసారి ధరలు పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఎందుకు పెరుగుతున్నాయి ధరలు?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో సరఫరా అంతరాయాలు, గ్లోబల్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరువ కావడం వల్ల భారత ఆయిల్ కంపెనీలపై భారీ ఆర్థిక ఒత్తిడి పెరిగింది.ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. రోజుకు వందల కోట్ల రూపాయల అండర్ రికవరీలు నమోదవుతున్నాయని సమాచారం.
హైదరాబాద్‌లో ఎంత?..
హైదరాబాద్‌లో ఇప్పటికే దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు నమోదవుతున్నాయి. తాజా పెంపుతో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.110 దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డీజిల్ ధర కూడా రూ.99కు చేరువలో ఉంది.
ప్రజలపై ప్రభావం
ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఆన్లైన్ డెలివరీ ఛార్జీలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఒత్తిడి ఎదుర్కొంటున్న సామాన్యులకు ఇది మరో భారం కానుంది.