హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రాష్ర్ట ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయోపరిమితిని మరో పదేళ్లకు పెంచింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉంది. కాగా, తాజా ఉత్తర్వులతో ఈ వయోపరిమితి 44 ఏళ్లకు పెరిగింది. ఈ వయో సడలింపు ఏడాది పాటు అమలులో ఉండనుంది. నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా కాలం, నియామకాల ఆలస్యం, నోటిఫికేషన్లు లేకపోవడం వంటి పలు కారణాల వల్ల చాలామంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారని.. వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే నోటిఫికేషన్లకు ఈ వయోసడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే ఈ సడలింపు యూనిఫాం సర్వీసులకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేశారు. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైలు, అటవీ శాఖల వంటి శారీరక ప్రమాణాలు అవసరమైన ఉద్యోగాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని పేర్కొన్నారు