-
సాధారణ ప్రజలకు సేవలు అందాలంటే తప్పనిసరిగా డబ్బుల డిమాండ్
-
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు
-
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
నల్లగొండ , క్రైమ్ మిర్రర్: జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది అధికారులు, సిబ్బంది లంచాలకు అలవాటుపడటం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. సాధారణ ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లినా, పని త్వరగా జరగాలంటే “చాయ్ ఖర్చు”, “ఫైల్ ఖర్చు” పేర్లతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ సేవలు పొందేందుకు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా, లంచం ఇవ్వకపోతే ఫైళ్లు ముందుకు కదలడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు, భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్, వివిధ అనుమతుల వంటి పనుల్లో కూడా కొందరు అధికారులు డబ్బులు అడుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొన్ని కార్యాలయాల్లో మాత్రం పరిస్థితి మారడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. లంచం ఇవ్వలేని వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుండగా, డబ్బులు ఇచ్చిన వారి పనులు మాత్రం వేగంగా పూర్తవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కార్యాలయాల్లో పారదర్శక విధానాలు అమలు చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.