HomeజాతీయంYogi Adityanath: రోడ్లపై నమాజ్‌ చేస్తే చర్యలు తప్పవు, బక్రీద్‌కు ముందు యోగి కీలక వ్యాఖ్యలు!

Yogi Adityanath: రోడ్లపై నమాజ్‌ చేస్తే చర్యలు తప్పవు, బక్రీద్‌కు ముందు యోగి కీలక వ్యాఖ్యలు!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోడ్లపై నమాజ్‌లు చేయకూడదని హెచ్చరించారు. మతపరమైన ప్రార్థనలు ఎక్కడ పడితే అక్కడ కాకుండా, నిర్ణయించిన ప్రార్థనా స్థలాల్లోనే నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన యోగి, రహదారులపై నమాజ్‌లు చేయడం వల్ల ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ‘‘రోడ్లు ప్రజలు నడవడానికి, వాహనాలు వెళ్లడానికి ఉంటాయి. వాటిని బ్లాక్‌ చేసి ప్రార్థనలు చేయడం సరైంది కాదు’’ అన్నారు. ఎవరికీ రహదారులను ఆక్రమించే హక్కు లేదని, ప్రార్థనలు చేయాలంటే మసీదులు, ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో చేయాలని సూచించారు.

షిఫ్టుల వారీగా నమాజ్ చేసుకోండి!

ప్రార్థనలకు స్థలం సరిపోకపోతే షిఫ్టుల వారీగా నమాజ్‌లు నిర్వహించుకోవచ్చని యోగి సూచించారు. ‘‘ప్రార్థనలు చేయకుండా మేమెవరినీ ఆపడం లేదు. కానీ రోడ్లపై, వీధుల్లో నమాజ్‌లు చేస్తే మాత్రం అనుమతి ఉండదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశంలో కలిసి జీవించాలంటే ప్రతి ఒక్కరూ చట్టాలు, నిబంధనలు పాటించాలని అన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందన్నారు. అవసరమైతే ప్రజలు తమ కుటుంబ నియంత్రణపైనా ఆలోచించాలని కూడా వ్యాఖ్యానించారు. ఇకపై రహదారులపై ఇలాంటి కార్యక్రమాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని యోగి హెచ్చరించారు. శాంతియుతంగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్య ఉండదని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చ

ఈ నెల 28న ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకోనున్న నేపథ్యంలో యోగి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. పండుగ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకేచోట చేరే పరిస్థితి ఉండటంతో ముందుగానే ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు