జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహంను మేధస్సు, వాణిజ్యం, సంభాషణ, తర్కశక్తి మరియు విద్యకు కారకుడిగా భావిస్తారు. ముఖ్యంగా బుధవారం రోజును బుధ గ్రహానికి అంకితమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని, విద్య, వ్యాపార రంగాల్లో విజయాలు సాధ్యమవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, సమాచార సాంకేతిక రంగంలో పనిచేసేవారు, వ్యాపారులు ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని విశ్వసిస్తారు.
బుధ గ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు ఆకుపచ్చ. అందుకే బుధవారం రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు, ఇంటి అలంకరణకు ఉపయోగించే ఆకుపచ్చ వస్తువులు లేదా తాజా ఆకుకూరలు, పచ్చని కూరగాయలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొని కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుందని అంటారు. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి కూడా ఇది సహాయపడుతుందని నమ్మకం ఉంది.
విద్యకు సంబంధించిన వస్తువులను బుధవారం రోజున కొనడం కూడా ఎంతో మంచిదిగా భావిస్తారు. పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్స్ లేదా చదువుకు అవసరమైన ఇతర సామగ్రిని ఈ రోజున కొనుగోలు చేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు బుధవారం రోజున కొత్త పుస్తకాలు కొనడం వల్ల చదువులో మంచి పురోగతి కనిపిస్తుందని చెబుతారు.
అలాగే పచ్చ పెసలను బుధవారం కొనుగోలు చేయడం కూడా ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ పెసలను ఇంటికి తీసుకువచ్చి వినాయకుడుకు నైవేద్యంగా సమర్పించడం లేదా పేదలకు దానం చేయడం వల్ల బుధ దోష ప్రభావం తగ్గుతుందని అంటారు. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి పనుల్లో విజయాలు లభిస్తాయని విశ్వసిస్తారు.
ఇక కంచుతో చేసిన పాత్రలు, పూజా సామాగ్రి లేదా దేవతల విగ్రహాలను బుధవారం రోజున కొనుగోలు చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఇలాంటి వస్తువులను ఇంటికి లేదా కార్యాలయానికి తీసుకురావడం వల్ల ఆర్థిక నష్టాలు తగ్గి అభివృద్ధి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సంపద నిలుస్తుందని కూడా విశ్వసిస్తారు.
మీ జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు లేదా విద్య, వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు బుధవారం రోజున ఈ పరిహారాలను ఆచరించి విఘ్నేశ్వరుడును భక్తితో ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
NOTE: పై వార్తాలోని సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే తెలియజేశాం. నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం. క్రైమ్ మిర్రర్ దీనిని అధికారికంగా ధృవీకరించట్లేదు.
ALSO READ: ఓటీటీలో ధురంధర్-2 సంచలనం.. సర్వర్లు క్రాష్