క్రైమ్ మిర్రర్ (రంగారెడ్డి ప్రతినిధి) : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో సాదా బైనామా భూములు దళారుల చేతుల్లోకి వెళ్తున్నాయంటూ గత నెలలో క్రైమ్ మిర్రర్ దినపత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. ఈ వార్తపై జిల్లా రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. గతం లో వున్నా ధరణి వ్యవస్థను అడ్డుపెట్టుకొని నర్సయిపల్లి గ్రామానికి చెందిన సదరు వ్యక్తి అమాయక రైతులను మోసం చేస్తున్నాడని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం సాదా బైనామా పద్ధతిలో భూములు కొనుగోలు చేసి వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఇప్పుడు భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే భూములను విక్రయించిన వ్యక్తుల పేర్లపై ధరణి అమలులోకి వచ్చిన తర్వాత మళ్లీ కొత్త పాసుబుక్లు జారీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో మాడ్గుల తహసీల్దార్ కార్యాలయంలో భారీ అక్రమాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధిత రైతులకు న్యాయం చేయాలని అధికారులు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం జిల్లా రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మాడ్గుల మండలంలో జరుగుతున్న భూ అక్రమాలపై ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం.