HomeజాతీయంNEET Paper Leak: నీట్ పేపర్ లీక్ అయ్యిందా? ఎన్‌టీఏ కీలక ప్రకటన!

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ అయ్యిందా? ఎన్‌టీఏ కీలక ప్రకటన!

NEET Paper Leak Allegations: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న నిర్వహించిన నీట్ పరీక్షపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఓ గెస్ పేపర్.. పరీక్షకు ముందు పెద్ద ఎత్తున విద్యార్థుల మధ్య చక్కర్లు కొట్టినట్లు అధికారులు గుర్తించారు.

హ్యాండ్‌రైటింగ్‌లో ఉన్న ప్రశ్నల మెటీరియల్‌

ఈ హ్యాండ్‌రైటింగ్‌లో ఉన్న ప్రశ్నల మెటీరియల్‌లో మొత్తం 281 ప్రశ్నలు ఉన్నాయని సమాచారం. వాటిలో 135 ప్రశ్నలు అసలు నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో చాలా వరకు సరిపోలినట్లు చెబుతున్నారు. దీంతో ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనా? లేక నిజంగానే ప్రశ్నపత్రం లీక్ జరిగిందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

రాజస్థాన్ లో కొనసాగుతున్న దర్యాప్తు

ఈ ఘటనపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) దర్యాప్తు ప్రారంభించింది. ఈ మెటీరియల్ మే 1న రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో మొదట అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు రెండు రోజుల ముందే ఇది విద్యార్థులకు చేరినట్లు గుర్తించారు. కొంతమంది దీన్ని రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు అమ్మినట్లు సమాచారం. ఈ ప్రాక్టీస్ మెటీరియల్‌లో  బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బయాలజీకి చెందిన 90 ప్రశ్నలు, కెమిస్ట్రీకి చెందిన 45 ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చిన వాటితో పోలి ఉన్నట్లు గుర్తించారు. నీట్ మొత్తం 720 మార్కులకు నిర్వహించగా, ఈ ప్రశ్నలు దాదాపు 600 మార్కులకు సంబంధించినవిగా చెబుతున్నారు.

దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. ఈ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా గుర్తించారు. అతడు ఈ మెటీరియల్‌ను సికార్‌లో ఉన్న తన స్నేహితుడికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి అది హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, పరీక్ష రాసే విద్యార్థుల వరకు విస్తరించినట్లు సమాచారం.

స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ!

ఇదిలా ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఈ అంశంపై స్పందించింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాతే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. మొత్తం వ్యవహారాన్ని పారదర్శకంగా పరిశీలించి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు