HomeజాతీయంPetrol-Diesel Prices: పెరగనున్న పెట్రోల్‌, డీజిల్ రేట్లు.. ఈసారి ఏకంగా అంత పెరుగుతాయా?

Petrol-Diesel Prices: పెరగనున్న పెట్రోల్‌, డీజిల్ రేట్లు.. ఈసారి ఏకంగా అంత పెరుగుతాయా?

Fuel Price Shock Before May 15: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా త్వరలో పెరగొచ్చని సమాచారం. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 105 డాలర్లను దాటడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరల పెంపుపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తొలి దశలో లీటర్‌కు రూ.4 నుంచి రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో వంట గ్యాస్ ధర కూడా సిలిండర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 15లోపే ధరల పెంపుపై అధికారిక ప్రకటన రావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునే వరకు యుద్ధం ఆగదని నెతన్యాహు ప్రకటించగా, ఇరాన్ ప్రతిపాదించిన రాజీ మార్గాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి త్వరగా చల్లారే అవకాశం కనిపించడం లేదు.

హోర్మూజ్ జలసంధిలో ఆందోళన

ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్మూజ్ జలసంధి పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. అక్కడ రాకపోకలు సవ్యంగా సాగకపోతే చమురు సరఫరాపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కారణంగా అనేక దేశాలు దీర్ఘకాల అనిశ్చితికి సిద్ధమవుతున్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల ప్రపంచ మార్కెట్లో చిన్న మార్పు జరిగినా దేశీయ ధరలపై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వరంగ చమురు సంస్థలకు ప్రతి నెలా వేల కోట్ల రూపాయల నష్టం వస్తోందని సమాచారం. ఈ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దశల వారీగా ధరలు పెంచే అవకాశం

ఒక్కసారిగా భారీగా ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది. అందుకే దశల వారీగా ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దాంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు సహా అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. రూపాయి విలువ తగ్గడం కూడా దిగుమతి భారాన్ని మరింత పెంచుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు