Homeతెలంగాణరూ. 1100 కోట్లతో విద్యా కిట్లు.. తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త సంస్కరణలు, సీఎం రేవంత్...

రూ. 1100 కోట్లతో విద్యా కిట్లు.. తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త సంస్కరణలు, సీఎం రేవంత్ ప్రకటన

తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు ప్రకటించారు. విద్యా కమిషన్ సూచనల మేరకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నూతన విధానాన్ని అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో 38 లక్షల మంది చదువుతుంటే.. ప్రభుత్వ బడుల్లో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఉండటం ఆలోచించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయింపులను దశలవారీగా 15 శాతానికి పెంచనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు 9 రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక విద్యా కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ విద్యా కిట్ల తయారీ కోసం సుమారు రూ. 1100 కోట్లు కేటాయించినట్లు వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు.

విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం పాలు, రాగి జావ వంటి బలవర్ధకమైన పోషకాహారాన్ని మెనూలో చేర్చారు. పౌష్టికాహారం అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల ద్వారా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన చదువు చేరువవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ALSO READ: తెలంగాణ కార్మిక లోకానికి శుభవార్త.. కనీస వేతనాల సవరణపై ప్రభుత్వం కీలక కసరత్తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు