HomeజాతీయంKerala CM: కేరళ సీఎం ఎవరు? ఉత్కంఠకు నేడు తెర పడే అవకాశం!

Kerala CM: కేరళ సీఎం ఎవరు? ఉత్కంఠకు నేడు తెర పడే అవకాశం!

Kerala CM Candidate: కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో ముగింపు పలకనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ(మంగళవారం) అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. నిర్ణయం ఆలస్యం అయితే పార్టీలో అసంతృప్తి, రాజకీయ గందరగోళం పెరిగే అవకాశం ఉండటంతో అధిష్టానం త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రాహుల్ వరుస సమావేశాలు

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల అనంతరం సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సీఎం రేసులో ముందున్న కేసీ వేణుగోపాల్

ప్రస్తుతం సీఎం పదవికి ప్రధాన పోటీదారు కేసీ వేణుగోపాల్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవీడీ సతీషన్, సీనియర్ నేత రమేష్ చెన్నితల పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 14న కొత్త యూడీఎఫ్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో UDF ఘన విజయం

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. మొత్తం 102 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావడానికి సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ఈసారి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. అయితే, సీఎం ఎంపికపై పార్టీలో అంతర్గతంగా పోటీ నెలకొంది. గత కొన్ని రోజులుగా కేసీ వేణుగోపాల్, సతీషన్ అనుచరుల మధ్య పోస్టర్ల యుద్ధం కూడా జరిగింది. తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలంటూ రెండు వర్గాల నాయకులు బహిరంగంగా బలప్రదర్శనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కీలక మిత్రపక్షమైన ఐయూఎంఎల్ కూడా సీఎం ఎంపికలో జరుగుతున్న ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జాప్యం కొనసాగితే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీయొచ్చని హెచ్చరించింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు