హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘విద్యా వారోత్సవాల’ను ఘనంగా ప్రారంభించారు. కోటి 34 లక్షల జనాభా కలిగిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధికి ఆయన కీలక ప్రణాళికను ఆవిష్కరించారు. సుమారు రూ.1700 కోట్లతో నగరంలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను సేకరించి భారీ ఎడ్యుకేషన్ హబ్‌లను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తో పాటు మాజీ కెప్టెన్ అజారుద్దీన్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలుపంచుకున్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షను ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కావడంలో విద్యార్థులు పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు. యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం అంటే సమాజాన్ని బలహీనపరచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వర్సిటీలలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని భరోసా ఇచ్చారు. పేదలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారానే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే కేంద్రాలుగా విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు.
తెలంగాణ ఉపాధ్యాయులకు ప్రపంచ స్థాయి బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు విదేశీ పర్యటనలకు పంపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటికే 25 మంది టీచర్లను ఫిన్లాండ్కు పంపించామని త్వరలో వియత్నాం, జపాన్, సింగపూర్ దేశాలకు మరికొందరిని పంపిస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏటా 500 మంది ఉపాధ్యాయులను విదేశీ శిక్షణకు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ నేర్చుకున్న ఆధునిక విద్యా నైపుణ్యాన్ని మన ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిధుల కొరత లేకుండా విద్యా రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రతి నిరుపేద బిడ్డకు ఉన్నత చదువులు అందాలనే సంకల్పంతో కొత్త విద్యా విధానాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎడ్యుకేషన్ హబ్‌ల ద్వారా గ్రామీణ విద్యార్థులకు కూడా నగర ప్రాంత సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసికట్టుగా నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ALSO READ: గుప్తనిధుల కోసమే కాకతీయుల ఆలయం కూల్చివేత.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు సంచలన ఆరోపణలు