కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపికపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. కేరళకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
సీఎం రేసులో ముగ్గురి పేర్లు
ప్రస్తుతం సీఎం పదవికి ముగ్గురు ప్రముఖ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, సీనియర్ నేత రమేష్ చిన్నితలా, అలాగే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఎవరికి అధిష్టానం అవకాశం ఇస్తుందన్నదానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను పంపింది. వారు రాష్ట్రంలోని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఆ వివరాలతో కూడిన నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించారు. ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఆయా నేతలకు మద్దతుగా అనుచరుల ప్రచారం
అటు సీఎం రేసులో ఉన్న నేతలకు మద్దతుగా వారి అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపడుతున్నారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహిస్తూ తమ నాయకుడికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నగరాలు, పట్టణాల్లో భారీ పోస్టర్లు, కటౌట్లు, బిల్ బోర్డులు ఏర్పాటు చేసి తమ మద్దతును బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. కేరళ కాంగ్రెస్లో నెలకొన్న ఈ రాజకీయ ఆసక్తికర పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈరోజు సాయంత్రానికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తుది ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.