Homeలైఫ్ స్టైల్దాహం వేయట్లేదని నీళ్లు తాగట్లేదా... ఏసీ గదుల్లో పనిచేసే వారికి ఇది పెద్ద ప్రమాదం...!

దాహం వేయట్లేదని నీళ్లు తాగట్లేదా… ఏసీ గదుల్లో పనిచేసే వారికి ఇది పెద్ద ప్రమాదం…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: చాలామంది డీహైడ్రేషన్ అంటే ఎండలో ఎక్కువగా తిరిగేవారికే వస్తుందని భావిస్తారు. కానీ ఇప్పుడు వైద్య నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే.. రోజంతా ఏసీ గదుల్లో పనిచేసే ఉద్యోగులు కూడా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందట. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం…!

ఏసీ గదుల్లో ఉండటం వల్ల చెమట పట్టదు. దీంతో శరీరానికి దాహం సంకేతాలు అంతగా కనిపించవు. కానీ శరీరంలోని నీటి శాతం మాత్రం నెమ్మదిగా తగ్గిపోతూనే ఉంటుంది. గదిలోని తేమను ఏసీ పీల్చేయడం వల్ల చర్మం, శ్వాస ద్వారా శరీరంలో ఉన్న తేమ బయటకు వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియ మనకు కనిపించదు కాబట్టి చాలామంది దాన్ని పట్టించుకోరు.

ఇలా చేస్తే ఇక అంతే సంగతులు…!

ఆఫీసుల్లో పనిచేసేవారు అలసటగా అనిపిస్తే ఎక్కువగా టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ ఇవి శరీరానికి మరింత నష్టం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. టీ, కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని నీటిని బయటకు పంపిస్తుంది. దీంతో హైడ్రేషన్ తగ్గిపోతుంది. ఫలితంగా తలనొప్పి, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు కూడా చాలా మందికి తెలియవు. కళ్లు మంటలు పెట్టడం, చర్మం పొడిబారడం, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, సాయంత్రానికి తీవ్రమైన అలసట అనిపించడం ఇవన్నీ శరీరంలో నీరు తగ్గుతున్న సంకేతాలే.

దీర్ఘకాలంగా నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దాహం వేసే వరకు వేచి ఉండకుండా తరచూ నీళ్లు తాగడం చాలా అవసరం.

నిపుణుల సూచనల ప్రకారం ప్రతి గంటకు ఒకసారి నీళ్లు తాగాలి. పని డెస్క్‌పై నీటి బాటిల్ ఉంచుకోవాలి. టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవడం మంచిది. అలాగే గంటకోసారి లేచి కొద్దిసేపు నడిస్తే కూడా శరీరానికి రిలీఫ్ లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా దాహం వేయకపోయినా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు