Jail Officer Marries Former Inmate: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రేమ వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హోదాలు, మతాలు, సామాజిక అడ్డంకులు నిజమైన ప్రేమ ముందు పెద్దవి కావని ఈ జంట నిరూపించింది. జైలులో ఖైదీలను పర్యవేక్షించే ఓ మహిళా అధికారిణి.. అదే జైలులో శిక్ష అనుభవించిన మాజీ ఖైదీని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మధ్యప్రదేశ్‌లోని సత్నా కేంద్ర కారాగారంలో ఫిరోజా ఖాతూన్ అనే మహిళ డిప్యూటీ జైలర్ గా పనిచేస్తున్నారు. ఇదే జైలులో ధర్మేంద్ర అనే వ్యక్తి 2007లో జరిగిన హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవించాడు. జైలు జీవితం గడుపుతున్న సమయంలో ధర్మేంద్ర ప్రవర్తనలో వచ్చిన మార్పు ఫిరోజాను ఆకట్టుకుంది. క్రమంగా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత ఇబ్బందులు మొదలయ్యాయి. ఫిరోజా ముస్లిం మతానికి చెందిన వారు కాగా, ధర్మేంద్ర హిందువు కావడంతో ఈ వివాహానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినప్పటికీ సమాజం ఏమనుకుంటుందన్న దానికంటే తమ జీవితమే ముఖ్యమని భావించిన ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం
ఇటీవల ఛతర్‌పూర్ జిల్లాలోని లవ్‌కుష్ నగర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఫిరోజా ఖాతూన్ హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ వేద మంత్రాల నడుమ ధర్మేంద్రను వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకులు కూడా ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు జైలులో ఖైదీగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు అదే జైలు అధికారిణికి భర్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించడం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు, వారి ప్రేమకథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.