క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 2026 నాటికి రేషన్ కార్డుదారులకు శుభవార్త చెపుతూ వారికీ సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల్లో పోషకాహార విలువలను పెంచేందుకు ఇప్పటివరకు ఇస్తున్న బియ్యంతో పాటు ఇకపై జొన్నలు (Sorghum) మరియు మొక్కజొన్నలను కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
రైతుల నుంచి మార్క్ఫెడ్ (MARKFED) ద్వారా సేకరించిన ఈ ధాన్యాలను నేరుగా లబ్ధిదారులకు అందించడం వల్ల పేదవారి ఆకలి తీరడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఉగాది (2025) నుంచి అమల్లోకి వచ్చిన పథకం ప్రకారం, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
కొన్ని రకాల కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర మరియు గోధుమలను కూడా రాయితీ ధరలకు లేదా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాలతో పాటు ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కూడా విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారంగా జొన్నలను అందించాలని అధికారులను ఆదేశించారు.