అసెంబ్లీ ఎన్నికల ముగింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జోరందుకుంది. ఈ పుకార్లతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ధరలు పెరగకముందే ట్యాంకులు నింపుకోవాలనే ఉద్దేశంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తారు. అనేక నగరాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టడంతో ప్యానిక్ కొనుగోళ్ల పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఈ భయాన్ని మరింత పెంచాయి.
ఈ పరిణామాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంగళవారం అత్యవసరంగా స్పందించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక వివరణ ఇచ్చింది. పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుపై వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.
ప్రస్తుతానికి పెట్రోల్ లేదా డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు. ధరల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ప్రభుత్వ ప్రకటనతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశీయంగా ధరల స్థిరీకరణకే మొగ్గు చూపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే – మంత్రి కోమటిరెడ్డి