క్రైమ్ మిర్రర్, సినిమా:- అక్కినేని కుటుంబం నుంచి హీరోగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన సుమంత్ తన కెరీర్లో ఎన్నో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న ఆయన, తర్వాత కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల అనగనగా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమంత్, ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా చిత్రంతో జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సుమంత్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్లో మిస్ అయిన రెండు పెద్ద అవకాశాల గురించి వెల్లడించిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోజూ 2 కివీలు తింటే మలబద్ధకం నిజంగా తగ్గుతుందా?
సుమంత్ మాట్లాడుతూ.. దర్శకుడు కె. విజయభాస్కర్ తెరకెక్కించిన నువ్వే కావాలి సినిమా కోసం మొదట తననే సంప్రదించారని చెప్పారు. అయితే ఆ సమయంలో యువకుడు, పెళ్లి సంబంధం చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో తేదీలు సర్దుబాటు కాక ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. అనంతరం ఆ సినిమాలో హీరోగా నటించిన తరుణ్‌కు ఆ చిత్రం భారీ విజయాన్ని అందించింది.అలాగే మరో ఆసక్తికర విషయాన్ని కూడా సుమంత్ పంచుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు కథను కూడా మొదట తనకే వినిపించారని చెప్పారు. అయితే ఆ సినిమా చివరకు అల్లు అర్జున్ చేయడం సరైన నిర్ణయమైందని అభిప్రాయపడ్డారు. నేను చేసి ఉంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యేదో కాదో తెలియదు. అల్లు అర్జున్‌కు ఆ పాత్ర అద్భుతంగా సెట్ అయింది అంటూ ఆయన నిజాయితీగా స్పందించారు.సినిమా పరిశ్రమలో ఒక కథ ఒక హీరో నుంచి మరో హీరో వద్దకు వెళ్లడం సహజమే. అయితే కొన్ని సినిమాలు మాత్రం నటుల కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తాయి. నువ్వే కావాలి, దేశముదురు వంటి చిత్రాలు కూడా అలాంటి జాబితాలోనే ఉంటాయి. ఈ రెండు సినిమాలను సుమంత్ మిస్ చేసుకున్న విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం సుమంత్ నటించిన న్యూటన్ థర్డ్ లా విడుదలకు సిద్ధమవుతోంది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరోసారి తన నటనతో ఆకట్టుకుంటాననే నమ్మకంతో సుమంత్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
