-
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
-
కవిత పార్టీ ప్రకటన తర్వాత పెరిగిన టాక్
-
మాతృ పార్టీ వైపు ఎదురుచూస్తున్న గులాబీ నేతలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో టిడిపి రీఎంట్రీ ఇవ్వనుందా? ఇదే సరైన సమయమని ఆ పార్టీ హై కమాండ్ భావిస్తోందా? గులాబీ పార్టీ ఇబ్బందులు పడుతున్న వేళ పాత బృందమంతా టిడిపి వైపు చూస్తుందా? అందుకే చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కవిత పార్టీ ప్రకటన తర్వాత తెలంగాణలో టిడిపి రీఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
చాలా మంది నేతలు సిద్ధం..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. ఒకటి రెండుసార్లు చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు కూడా వెళ్లారు. తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు కూడా. మరోవైపు తీగల కృష్ణారెడ్డి, బాబు మోహన్ లాంటి నేతలు తిరిగి టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఆ ఇద్దరు మాత్రమే కాదు టిడిపి తెలంగాణలో రీఎంట్రీ ఇస్తే చాలామంది నేతలు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగానే అక్కడ పార్టీని బలోపేతం చేయలేదన్న టాక్ వచ్చింది. మరోసారి టిడిపి రీయంట్రీ ఇస్తే కెసిఆర్ దానిని అనుకూలంగా మలుచుకుంటారన్నది ఒక ఆందోళన. కానీ ఇప్పుడు ఆయనపై కుమార్తె కవిత తిరుగుబాటు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన పార్టీగా గులాబీ పార్టీని అభివర్ణించారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సెంటిమెంటును మరిచి భారత రాష్ట్ర సమితిగా మార్చారో.. అప్పుడే తెలంగాణ ఉద్యమం నుంచి ఆ పార్టీ పక్కకు వెళ్లిపోయింది అంటూ కవిత ఆరోపణలు చేశారు. దీంతో గులాబీ పార్టీలో కొనసాగుతున్న టిడిపి నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.
కెసిఆర్ పనైపోవడంతో..
కవిత పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రీఎంట్రీ పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీలో కొనసాగుతున్న టిడిపి నేతలంతా ఇప్పుడు మాతృ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది. దానికి కారణం లేకపోలేదు. చంద్రబాబును అడ్డం పెట్టుకొని ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్‌తో రెచ్చిపోయే వారు కేసీఆర్. అందుకే వరుసగా టిడిపి అక్కడ బలహీనం అవుతూ వచ్చింది. రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ చాలామంది టీడీపీ నేతలు గులాబీ పార్టీని ఆశ్రయించారు. కేవలం రాజకీయం కోసమే వారు వెళ్లిపోయారు తప్ప చంద్రబాబు పై కోపం కాదు. కానీ ఇప్పుడు టిడిపి అవసరాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తోంది అనే టాక్ ప్రారంభం అయింది. తెలంగాణ సమాజంలో చంద్రబాబు పై ఉన్న కోపం కూడా తగ్గిపోయింది. అక్కడ అన్ని పార్టీల నేతలు చంద్రబాబు పట్ల సానుకూలత చూపుతున్నారు. అందుకే ఇప్పుడు టిడిపి రీఎంట్రీ కి సరైన సమయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ పార్టీలో ఉన్నది టిడిపి వారే..
పేరుకే అది గులాబీ పార్టీ కానీ పార్టీ అధినేత కేసిఆర్ నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకు అంతా టిడిపి దే. కెసిఆర్ కుటుంబంలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు ఇప్పుడు క్యాడర్ కు మింగుడు పడడం లేదు. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇస్తే ఆ పార్టీ గొడుగు కిందకు చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పైగా సీఎం రేవంత్ రెడ్డి టిడిపి ఎదిగేందుకు ఎంతో కొంత సహకరిస్తారు. మరోవైపు బిజెపితో కూడా టిడిపికి జాతీయ స్థాయిలో స్నేహం ఉంది. తెలంగాణలో టిడిపి బలపడితే తమకు రాజకీయంగా అండగా నిలుస్తుందని బిజెపి నమ్మకం. ఇలా పరిస్థితులన్నీ కలిసి వస్తుండడంతోనే తెలంగాణలో తెలుగుదేశం రీఎంట్రీ ఇస్తుందన్న టాక్ మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.