Homeక్రైమ్జోగులాంబ గద్వాల్‌లో విషాదం: 98% మార్కులు సాధించిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్‌పై తీవ్ర ఆరోపణలు

జోగులాంబ గద్వాల్‌లో విషాదం: 98% మార్కులు సాధించిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్‌పై తీవ్ర ఆరోపణలు

  • తరగతి గదిలో అవమానం భరించలేక మనస్తాపం – సూసైడ్ నోట్‌లో బయటపడ్డ సంచలన అంశాలు

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తరుణ్ (18) అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

తరుణ్ గద్వాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. అతను ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి 98.63 శాతం పొందాడు. జిల్లాలో రెండో ర్యాంక్ సాధించినప్పటికీ, మరో విద్యార్థికి 435 మార్కులు రావడంతో ఒక్క మార్కు తేడాతో మొదటి స్థానం చేజారింది.

ఈ నేపథ్యంలో కళాశాలలో జరిగిన సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని తరుణ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. “434 మార్కులు సాధించావంటే నువ్వేమైనా గొప్పోడివా? నీకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు కూడా ఉన్నారు” అంటూ లెక్చరర్ తనను అందరి ముందు కించపరిచినట్టు తెలిపాడు.

అదే కాకుండా, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడవద్దని తాను విజ్ఞప్తి చేసినప్పటికీ, లెక్చరర్ వినకుండా “నువ్వేమైనా మంత్రి కొడుకువా? అంతకంటే గొప్పోడివా?” అంటూ అవమానకరంగా వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నాడు. ఇంకా, తోటి విద్యార్థుల ముందే చెంపపై కొట్టి అవమానించారని కూడా లేఖలో వివరించాడు.

తరగతి గదిలో జరిగిన ఈ ఘటనతో పాటు, తోటి విద్యార్థుల నవ్వులు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని తరుణ్ రాసినట్టు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, బాధితుడి కుటుంబ సభ్యులు సంబంధిత లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

also read: అంబర్‌పేట్‌లో విషాదం: కుటుంబ వేధింపులు తట్టుకోలేక సెల్ఫీ వీడియోతో వ్యక్తి ఆత్మహత్య

తాజావార్తలు