Supreme Court on Live-in Relationship: సుదీర్ఘకాలం పరస్పర అంగీకారంతో సహజీవనం కొనసాగించిన ఇద్దరి మధ్య బంధం చెడిన తర్వాత దాన్ని అత్యాచారంగా పరిగణించాలా అనే అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళ తన మాజీ సహజీవన భాగస్వామిపై పెట్టిన కేసు నేపథ్యంలో స్పందించింది.
ఇంతకీ అసలు కేసు ఏంటంటే?
ఈ కేసులో మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా ఉపయోగించుకున్నాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పటికే ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయన్ ధర్మాసనం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇద్దరూ చాలా కాలం పాటు కలిసి జీవించారని, వారికి ఒక సంతానం కూడా ఉందని కోర్టు గుర్తు చేసింది. అలాంటి సందర్భంలో, సంబంధం ముగిసిన తర్వాత దాన్ని నేరంగా పరిగణించడం సరైనదేనా అని ప్రశ్నించింది. సహజీవనం అనేది పరస్పర అంగీకారంతో కొనసాగుతుంది. అందులో ఉండే కొన్ని ప్రమాదాలను కూడా అంగీకరించాల్సి ఉంటుందని సూచించింది. వివాహ బంధం లేకపోవడం వల్ల భాగస్వామి బయటికి వెళ్లిపోతే, అది స్వయంగా నేరంగా మారదని స్పష్టం చేసింది.
పెళ్లి చేస్తానని నమ్మించి..
ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, మహిళ చిన్న వయసులోనే భర్తను కోల్పోయిందని, ఆ తర్వాత నిందితుడు పెళ్లి చేస్తానని నమ్మించి సంబంధం పెట్టుకున్నాడని వాదించారు. అయితే, కోర్టు ఈ వాదనపై సందేహాలు వ్యక్తం చేసింది. పెళ్లి లేకుండానే ఎందుకు ఇంతకాలం కలిసి జీవించారో, అంతకాలం ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారో వివరణ కోరింది. పరస్పర అంగీకారంతో ఉన్న సహజీవన బంధాలు, లైంగిక నేరాల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సూచించింది.