హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: అతనికి సంపన్న మైనర్ బాలికలే టార్గెట్. వారితో పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నానని నమ్మించి, వంచించి ఏకంతంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలను కాజేసిన కేటుగాడిని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
సామాజిక మాద్యామాల్లో, ఇన్‌స్టా గ్రాములో తను ధనవంతుడినని నమ్మించి అమ్మాయిల వ్యక్తిగత ఫొటలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలింది. ఇన్‌స్టా వేదికగా డబ్బున్న అమ్మాయిలతో పరిచయం పెంచుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23) సోషల్ మీడియా వేదికగా.. గత రెండేళ్లలో దాదాపు 20 మందికి పైగా బాలికలను నమ్మించి మోసగించినట్లు విచారణలో వెల్లడైంది
ప్రస్తుతం మియాపూర్‌లో నివసిస్తున్న ఆజాద్.. జూబ్లీహిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లోని ఇళ్లపై నిఘా పెట్టేవాడు. అక్కడి వాచ్‌మెన్లు, తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లలోని మైనర్ బాలికలు, యువతుల వివరాలు సేకరించేవాడు. ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తాను ఖరీదైన కార్లు, పబ్బుల్లో దిగిన ఫోటోలను పంపి తనకు తాను పెద్ద ధనవంతుడినని నమ్మించేవాడు. వారిని ప్రేమలోకి దించి ఆ తర్వాత ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు.